English | Telugu

రాజమౌళితో చేసే సినిమాతో మరో పాన్‌ ఇండియా హీరోగా ఎదగనున్న సూపర్‌స్టార్‌ మహేష్‌!

టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌బాబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సూపర్‌స్టార్‌ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్‌ రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌ కాకుండా తను చేసే ప్రతి సినిమాలోనూ ఓ భిన్నమైన పాత్ర పోషించాలనుకుంటారు. ముఖ్యంగా మహేష్‌ అంటే డైరెక్టర్స్‌ నటుడు. తను ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించాడంటే ఆ సినిమా డైరెక్టర్‌ను పూర్తిగా నమ్ముతారు. ఆ డైరెక్టర్‌ తన క్యారెక్టర్‌ను ఎలా ప్రజెంట్‌ చెయ్యాలనుకుంటున్నాడో గుర్తించి దానికి తగ్గట్టుగా అతను పూర్తిగా శాటిస్‌ఫై అయ్యేలా చెయ్యడం మహేష్‌కి మొదటి నుంచీ అలవాటు. అందుకే అతను చేసిన కొన్ని సినిమాలు మిస్‌ఫైర్‌ అయ్యాయి. అయినప్పటికీ డైరెక్టర్‌పై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు. చేసిన సినిమాలు తక్కువే అయినా నటుడుగా పరిణతి చెందాడు మహేష్‌. అతని సినీ కెరీర్‌లో ఉత్తమ నటుడిగా 5 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్‌ అవార్డులు, 4 సైమా అవార్డులు అందుకున్నారు. హీరో కృష్ణను సూపర్‌స్టార్‌ అంటూ గౌరవంగా పిలుచుకునే అభిమానులు ఆ తర్వాత మహేష్‌ను సూపర్‌స్టార్‌ చేశారు. సినిమా ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు ఆగస్ట్‌ 9. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకుందాం.

1979లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘నీడ’ చిత్రంలో రమేష్‌బాబుతో కలిసి మొదటిసారి తెరపై కనిపించారు మహేష్‌. ఆ తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణ కోరిక మేరకు ‘పోరాటం’ చిత్రంలో కృష్ణతోపాటు కలిసి నటించారు. 12 సంవత్సరాలపాటు బాలనటుడిగా కొనసాగిన మహేష్‌ 1990 వరకు 8 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత స్టడీస్‌పై కాన్‌సన్‌ట్రేట్‌ చేసేందుకు 9 సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలనటుడిగా ఉన్నప్పుడే తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహేష్‌ హీరోగా మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తాడా అని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

1999లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వినీదత్‌ నిర్మించిన ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు మహేష్‌. తొలి చిత్రంతోనే హీరోగా అందర్నీ ఆకట్టుకున్న మహేష్‌ ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత చేసిన యువరాజు, వంశీ చిత్రాలు ఘోర పరాజయాల్ని చవిచూశాయి. ఆ సమయంలో తండ్రి కృష్ణ చొరవ తీసుకొని మహేష్‌ కెరీర్‌ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా తర్వాతి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను కృష్ణవంశీకి అప్పగించారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ‘మురారి’ చిత్రాన్ని రూపొందించి మహేష్‌కు భారీ విజయాన్ని అందించారు కృష్ణవంశీ. ఆ సినిమాతో హీరోగా ఒక స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు మహేష్‌.

మహేష్‌ కెరీర్‌ గ్రాఫ్‌ని గమనిస్తే అతను హీరోగా నటించిన సినిమాలు 28. అయితే అందులో సగం మాత్రమే సూపర్‌హిట్‌ అయ్యాయి. అయితే వాటిలో బ్లాక్‌బస్టర్సే ఎక్కువగా ఉండడం విశేషం. ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం.. ఇలా కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. దాంతో స్టార్‌ హీరోగా ఒక రేంజ్‌కి వెళ్ళిపోయారు మహేష్‌. సినిమాలతోనే కాదు కమర్షియల్‌ యాడ్స్‌తోనూ ఎప్పుడూ బిజీగా ఉంటారు మహేష్‌. కమర్షియల్‌ యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతం సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రామాన్ని, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాదు, కొన్ని వందల మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. వైద్య సహాయం కోసం ఎదురుచూసే వారి కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించిన ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్‌ తన నెక్స్‌ట్‌ మూవీపై కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు. పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే ఎడ్వంచరస్‌ యాక్షన్‌ మూవీకి సంబంధించి వర్కవుట్‌ చేస్తున్నారు. తన సినిమాల్లో హీరోలను రాజమౌళి ఎంత ఎలివేట్‌ చేస్తారో అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక కొత్త లుక్‌లో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నారు మహేష్‌. అందుకే మరో సినిమాలోగానీ, కమర్షియల్‌ యాడ్‌లోగానీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్‌ కెరీర్‌లో ఈ సినిమా అత్యంత కీలకంగా మారబోతోంది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎడ్వంచరస్‌గా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాతో మహేష్‌ మరో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంటారని సూపర్‌స్టార్‌ అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ చేసి ఇప్పుడు రాజమౌళితో ప్రపంచ స్థాయిలో తన ఇమేజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.