English | Telugu
విడాకులు ఖాయం... శోభితా నాగచైతన్యల జాతకం చెప్పిన వేణుస్వామి!
Updated : Aug 9, 2024
‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు..’. ఇది 60 ఏళ్ల క్రితం కొసరాజు రాసిన పాట, ఘంటసాల గానం చేశారు. ఈ పాటను ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అనేవాడు విధి చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఎవరి జీవితం ఎలా ఉంటుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎలా ముగుస్తుంది అనేది విధి మాత్రమే నిర్ణయించగలుగుతుంది. కానీ, కొందరు మేధావులు మాత్రం ఎదుటివారి జీవితం గురించి, వారికి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి ముందుగానే చెప్పగలం అనే భ్రమలో బ్రతికేస్తుంటారు. వారికి కలగబోయే మానసిక ఆందోళన గురించి ముందుగానే చెప్పి మరింత భయభ్రాంతుల్ని చేయడమే పనిగా పెట్టుకుంటారు. ప్రస్తుత సమాజంలో అలాంటి వికృత చేష్టలకు పాల్పడుతూ తను గొప్ప జ్యోతిష్యుడిని అని చెప్పుకునే వేణుస్వామికి మంచి స్టఫ్ దొరికింది. పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ ఎవరి గురించైనా అవాకులు, చవాకులు పేలే వేణుస్వామి మరోసారి అక్కినేని కుటుంబంపై పడ్డాడు.
గతంలో నాగచైతన్య, సమంత ఎంగేజ్‌మెంట్ జరిగినపుడు వారిద్దరి జాతకాలు బాగాలేదని, తప్పకుండా విడిపోతారని తన భవిష్యవాణిలో చెప్పాడు. అతను చెప్పినట్టుగానే కొంతకాలం క్రితం ఇద్దరూ విడిపోయారు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలవుతోంది. ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య ఓ ఇంటివాడవుదామని నటి శోభితా ధూళిపాళ్ళను ప్రేమించి పెళ్లి వరకు తీసుకొచ్చాడు. గురువారం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇది జరిగిన వెంటనే వేణుస్వామి వీరిద్దరి జాతకాలు చెప్పేందుకు రెడీ అయిపోయాడు. ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా సోషల్ మీడియాలో ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. అతను చెప్పినట్టుగానే శుక్రవారం ఒక వీడియోతో ప్రత్యక్షమయ్యాడు. తన పాండిత్యంతో బోర్డుపై లెక్కలు వేస్తూ సాధారణ చివరికి తేల్చింది ఏమిటంటే.. నాగచైతన్య, శోభిత పెళ్ళి కూడా నిలవదని, 2027 తర్వాత ఇద్దరూ విడిపోతారని చెప్పాడు. అది కూడా ఒక స్త్రీ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయని అంటున్నాడు.
నాగచైతన్య మొదటి పెళ్లికి నూటికి 50 మార్కులు వేస్తానని, ఇప్పుడు జరగబోయే పెళ్లికి మాత్రం నూటికి 10 మార్కులే ఇవ్వగలనని తేల్చి చెబుతున్నాడు. నాగచైతన్య, శోభిత జాతకాల్లో దోషాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు జరగకుండా ముందుగానే శాంతి చేయించుకుంటే మంచిది అనే సలహా కూడా ఇచ్చాడు. అన్నింటినీ మించి అతను చెప్పిన మరో విషయం.. తను చెప్పిన జాతకం అబద్ధం కావాలని కోరుకుంటున్నానని, దీంట్లో ఓడిపోవాలని తన మనసులో ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో కొసమెరుపు ఏమిటంటే.. మేధావులైన యూ ట్యూబ్ ఛానల్స్ వారు, సోషల్ మీడియా వారు ఇక తనపై రెచ్చిపోయి కామెంట్లు చెయ్యవచ్చని, అందులో కూడా క్రియేటివిటీ చూపించండి అంటూ హితబోధ చేశాడు.
ఇదీ.. మన వేణుస్వామిగారి పైత్యం. అతను చెప్పిన మాటలు చూస్తుంటే కేవలం పబ్లిసిటీ కోసం, తన యాక్టివిటీని పెంచుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పగలడు. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చెయ్యడం ద్వారా అతను చెప్పాలనుకున్నది ఏమిటి? నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళు విడిపోయారు. ఎంతోకాలం వెయిట్ చేసిన తర్వాత తనకు సరైన జోడీ అని భావించి శోభితను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. నువ్వు ఎదుటివారి క్షేమాన్ని కోరుకునేవాడివే అయితే.. వారిని పర్సనల్‌గా కలిసి వారి జాతకాలు చూసి, దానికి పరిహారం ఎలా చేస్తే మంచిది అనే విషయాల గురించి ముందుగానే చెప్పొచ్చు. అవసరమైతే నువ్వే ముహూర్తం పెట్టొచ్చు. ఓ పక్క అందరికీ మంచి జరగాలని చెబుతూనే వారి జీవితాలు ఎలా నాశనమవుతాయో ముందే చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు వ్యక్తుల పర్సనల్ విషయాల గురించి పబ్లిక్‌గా సోషల్ మీడియాలో లెక్కలు వేసి చూపించాల్సిన అవసరం ఎందుకుంటుంది? నీకు పబ్లిసిటీ కావాలి కాబట్టి, ఇలాంటి సెలబ్రిటీల గురించి నెగెటివ్‌గా చెబితే అందరూ చూస్తారు కాబట్టి.. ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేసుకున్నావు. పైగా తను చెప్పిన విషయాలను బాగా వైరల్ చెయ్యమని నువ్వే క్లూ ఇస్తున్నావు. దీన్నిబట్టి స్వార్థపూరితమైన నీ ఆలోచన గురించి అందరికీ తెలిసింది కదా. ఇకనైనా ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూసి వారి భవిష్యత్తు ఏమిటో చెప్పే ప్రయత్నం తగ్గిస్తే మంచిది. సాంకేతికంగా ముందుకు దూసుకెళ్తున్న సొసైటీని ఇలాంటి పనికిమాలిన విషయాలను జనాలపై రుద్దాలని వేణుస్వామి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత.