English | Telugu

అజిత్ సినిమా చేయాల‌ని ఉంద‌న్న శివ‌న్న‌!

అజిత్ సినిమా చేయాల‌ని ఉంద‌న్న శివ‌న్న‌!

నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా జైల‌ర్‌. ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించారు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌కి క‌ర్ణాట‌క నుంచి సాయం చేసే న‌ర‌సింహ కేర‌క్ట‌ర్‌లో న‌టించారు శివ‌రాజ్‌కుమార్‌. ఆయ‌న కేర‌క్ట‌ర్‌కి అమిత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ రిలీజ్ కాగానే అంద‌రి మ‌న‌సూ కెప్టెన్ మిల్ల‌ర్ మీద ప‌డుతోంది. ఈ సినిమాలోనూ కీ రోల్ చేశారు శివ‌రాజ్‌కుమార్‌. అంతే కాదు, పృథ్విరాజ్ సుకుమార‌న్‌తోనూ న‌టించారు. శివ‌రాజ్‌కుమార్ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ ల‌క్కీ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు క‌ర్ణాట‌క‌లో టాప్ స్టార్‌గా ఉంటూనే, న‌చ్చిన‌ప్పుడల్లా ఇత‌ర భాష‌ల్లో క‌నిపిస్తున్నారు శివ‌రాజ్‌కుమార్‌.

ఇటీవ‌ల మీడియాతో మాట్లాడారు శివ‌రాజ్‌కుమార్‌. ఎవ‌రితో ప‌నిచేయాల‌ని ఉంద‌నే ప్ర‌శ్న ఎదురైంది ఆయ‌న‌కు. అందుకు శివ‌రాజ్‌కుమార్ త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానం ఇచ్చారు. ``నాకు అజిత్‌కుమార్‌తో ప‌నిచేయాల‌ని ఉంది. అత‌నిలో ఒక రా లుక్ ఉంది. హి ఈజ్ వెరీ రా. చాలా మంచి మ‌నిషి. క్యూట్ వ్య‌క్తి. ఆయ‌న బైక్ మీద వెళ్లే చాలా వీడియోలు చూశాను. చాలా నార్మ‌ల్ వ్య‌క్తిగా క‌నిపిస్తారు. ఆ సింప్లిసిటీ నా మ‌న‌సుకు హ‌త్తుకుంది. ఆయ‌న‌తో న‌టించాల‌ని అనుకుంటున్నాను. ఆయ‌న న‌టించిన విశ్వాసం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒక మాట‌లో చెప్పాలంటే అది నా డ్రీమ్ రోల్‌. అలాంటి సినిమా చేస్తే నా ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఇద్ద‌రికీ మంచి ట్రీట్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అనుకుంటున్నాను`` అని అన్నారు. ఆయ‌న మాట‌ల్లో అజిత్ మీద అభిమానం క‌నిపించింది. అజిత్ సినిమాల‌ను అంత‌గా గుర్తుపెట్టుకుని చెప్పిన శివ‌న్న‌కు అజిత్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో థాంక్స్ చెబుతున్నారు. త్వ‌ర‌లోనే అజిత్ తో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నారు.

ధ‌నుష్ గురించి కూడా మాట్లాడారు శివ‌న్న‌. అత‌న్ని చూస్తే త‌న‌ను తాను చూసుకుంటున్న‌ట్టు అనిపిస్తోంద‌ని అన్నారు. కెప్టెన్ మిల్ల‌ర్‌లో త‌న కేర‌క్ట‌ర్ చాలా బావుంటుంద‌ని చెప్పారు.