English | Telugu

'మథగం' వెబ్ సిరీస్ రివ్యూ

'మథగం' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: మథగం
నటీనటులు: అథర్వ మురళి, మణికందన్, గౌతమ్ మీనన్, శరత్ రవి, వడివుక్క రాసి, నిఖిలా విమల్, ఇలవర్స్, రిషికాంత్, డెల్నాజ్ ఇరానీ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: ఎఎమ్ ఎడ్విన్ సాకే
మ్యూజిక్: దర్బుక శివ
నిర్మాతలు: డిస్నీ ప్లస్ ఒరిజినల్స్
దర్శకత్వం: ప్రశాంత్ మురుగేశన్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

క్రైమ్ థ్రిల్లర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా, సిరీస్ అని తేడా లేకుండా థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు చాలానే ఉన్నారు. ఈ జానర్ కి చెందిందే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన 'మథగం'. అథర్వ మురళి ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:
సంగు గణేషన్ అనే రౌడీ షీటర్. అతని అనుచరులతో కలిసి రాత్రిపూట ఒంటరిగా ఒకచోటుకి బయల్దేరి వెళ్తాడు. అయితే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ తో నైట్ పేట్రోలింగ్ చేసే పోలీసులకు దొరుకుతారు. అయితే అప్పుడే అక్కడకి వచ్చిన సుపరీయర్ అధికారి.. సంగు గణేషన్ ని  గుర్తుపట్టి ఎంక్వైరీ చేస్తుండగా అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. గుణ అనే ఒక వ్యక్తి సంగు గణేషన్ కి కాల్ చేసి రేపు జరుగబోయే పార్టీకి అన్నీ సిద్ధం చేయమని, లేకుంటే తిమింగిలం మనల్ని వదిలిపెట్టడని చెప్పి కాల్ చేస్తాడు. అయితే ఆ పోలీస్ తిమింగిలం ఎవరని అడుగగా పడాలం శేఖర్ అని అతను చెప్తాడు. ఇక అతను చనిపోయాడని పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెప్తాడు.  అయితే నిజం చెప్పమని సంగు గణేషన్ ని పోలీస్ బెదిరించగా.. అతను చనిపోలేదని బ్రతికే ఉన్నాడని చెప్తాడు.. మరి పడాలం శేఖర్ ఎవరు? పడాలం శేఖర్ చేస్తున్న పనులను పోలీస్ వ్యవస్థ ఎలా ఎదుర్కొంది అనేది మిగతా కథ.

విశ్లేషణ:
కొందరు క్రిమినల్స్ ని నైట్ డ్యూటీ అధికారులు విచారిస్తుండగా.. అక్కడికి డీసీపీ వచ్చి ఒకడిని పట్టుకొని విచారించగా అతనొక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తుంది. ఇలా కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే ఒక్కసారి విచారణ మొదలుపెట్టాక కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఈ కథ మొత్తంగా అయిదు ఎపిసోడ్‌లు కాగా.. మొదటి ఎపిసోడ్‌లో పాత్రలను పరిచయం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ మురుగేశన్.

క్రైమ్ థ్రిల్లర్ జానర్ కథలో ట్విస్ట్ లు, సస్పెన్స్ ఉంటేనే అవి సక్సెస్ అవుతాయి. అయితే ఈ మథగం వెబ్ సిరీస్ లో కథని నడిపిన విధానం కుదరలేదు. స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. ఒక ఇంటెన్స్ మిస్ అయింది. హీరో అధర్వ మురళికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఏదో ఉన్నాడా అంటే ఉన్నాడన్నట్టుగా చూపించారు. కథలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేకుండా సప్పగా సాగుతుంది. ఏదీ అంత సీరియస్ గా అనిపించదు. పాత్రలు ఒకటి రెండు కాదు వస్తూనే ఉంటాయి. కథలో క్రిమినల్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏదో బుక్ లో పేజీలు తిరిగేస్తున్నట్టుగా ప్రేక్షకులకు అనిపిస్తుంది. అయితే ఒకేసారి అంతమందిని పరిచయం చేయడంతో ప్రేక్షకులకు పాత్రలని గుర్తుంచుకోవడం కొంత కష్టమే అనిపిస్తుంది.

రాజకీయ నాయకుల చేతిలో, పోలీసుల భాద్యతలు ఎంతవరకు ఉంటాయో ఇప్పడికే చాలా చూశాం. అయితే పడాలం శేఖర్ ముఖ్యమైన విలన్ అయినప్పటికీ తగిన బ్యాక్ డ్రాప్ లేకుండా పోవడంతో కథ పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. అశ్వధ్ పాత్రని కూడా పెద్దగా చూపించకపోవడం ఒక మైనస్. కథలో మొదటి ఎపిసోడ్ లో ఉన్నంత వేగం.. తర్వాత మూడు ఎపిసోడ్ లలో కనబర్చలేకపోయాడు డైరెక్టర్. పోలీసులు ఒక సీక్రెట్ మిషన్ స్డార్ట్ చేసాక దానిని పూర్తిచేయడానికి చాలా టైమ్ తీసుకోకపోవడం.. ఎంతకి ఆ సీన్స్ ముందుకు కదలకపోవడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్డింది. చివరివరకు ఒక పార్టీ అంటూ పడాలం శేఖర్ చెప్తున్న.. అది దేనికోసం? ఎందుకు అనే స్పష్టత లోపించింది. ఇక చివరి ఎపిసోడ్ లో పడాలం శేఖర్ ముఖ్యమైన విలన్ కాదు అతని పైన మరొకరు ఉన్నారని ముగించిన తీరు ఆకట్టుకుంది. కానీ ప్రతీ ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏమీ లేని కథకి ఇంత సాగదీయడం ఎందుకా అనిపిస్తుంది.

ఈ కథలో హీరోకి సరైన ఇంపార్టెంరన్స్ ఇవ్వకపోవడం పెద్ద మైనస్, స్లో సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకుడికి పెద్దగా నచ్చదు. ఇది బాగుంది అని చెప్పడానికి ఒక్కంటంటే ఒక్క సీన్ కూడా లేదు. ఇప్పటికే మనం చూసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్ల కంటే చాలా తక్కువ క్వాలిటీ ఉంది. ప్రతీ సీన్ లో ఆ తర్వాత ఎం జరుగుతుందనే క్యూరియాసిటి లేకపోగా, ఉన్న సీన్లని ఇంట్రెస్ట్ గా చూపించలేకపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ మురుగేశన్. ఎడిటింగ్ పెద్దగా ప్రభావం చూపలేదు. చాలా సీన్లకి కత్తెర వాడాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 

నటీనటుల పనితీరు:
పడాలం శేఖర్ పాత్రలో మణికందన్ ఆకట్టుకున్నాడు. అయితే అతనికి తగిన బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూపించి ఉంటే ఇంకా బాగుండేది. అశ్వధ్ గా అధర్వ మురళి  ఒక సిన్సియర్ డీసీపీగా ఆకట్టుకున్నాడు. గౌతమ్ మీనన్ కి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఇవ్వడం కాస్త నిరాశకి గురిచేస్తుంది. ఇక మిగిలినవాళ్ళు వారి పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లని ఇష్టపడేవారు ఇది చూడకపోవడమే బెటర్.‌ సాధారణ ప్రేక్షకులకి కూడా ఈ వెబ్ సిరీస్ అంతగా నచ్చకపోవచ్చు.

రేటింగ్: 2/5

✍🏻.దాసరి మల్లేశ్