English | Telugu

ట్రోల‌ర్స్‌కి ఫొటోతో క్లారిటీ ఇచ్చిన రామ్‌

యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న గ‌త చిత్రం స్కంద థియేట‌ర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక‌పోయింది. ఇప్పుడు సినిమా ఓటీటీలో ర‌న్ అవుతోంది. అయితే ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డింది. అదేంటంటే సినిమాలో జ‌రిగిన మేకింగ్ త‌ప్పుల‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్ జ‌రుగుతున్నాయి. ముందు సీన్‌లో చ‌నిపోయిన విల‌న్, కొంత‌సేప‌టి త‌ర్వాత మెయిన్ విల‌న్ వెనుకున్న విల‌న్ గ్యాంగ్‌లో క‌న‌డ‌టంతో పాటు రామ్‌కి బాడీ డ‌బుల్‌గా డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను న‌టించాడు. ఈ విష‌యాల‌కు సంబంధించిన వీడియోల‌ను ప‌ట్టుకున్న‌ నెటిజ‌న్స్ స్కంద సినిమాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయ‌టం ప్రారంభించారు.

ఇక లాభం లేద‌ని అనుకున్నారేమో హీరో రామ్ ఏకంగా రంగంలోకి దిగారు. క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌టానికి 25 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. అందులోనూ వేస‌వి కాలం. మూడో రోజు రామ్ పాదంలో ప‌గుళ్లు వ‌చ్చేశాయి. దీంతో త‌ను న‌డ‌వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. త‌న కాలి పాదం ఫొటోను షేర్ చేసిన రామ్.. ‘నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. మూడో రోజు న‌డ‌వ‌టానికి నాకు వీలు కాలేదు. పాదం నుంచి ర‌క్తం కారుతోంది. దాంతో మా డైరెక్ట‌ర్ నన్ను రెస్ట్ తీసుకోమ‌ని చెప్పి, నా బ‌దులుగా ఒకే ఒక సీన్‌లో న‌టించారు. న‌చ్చ‌టం, న‌చ్చ‌క‌పోవ‌టం అనేది ఆడియెన్స్‌కే వ‌దిలేస్తున్నాను. ఏది చేసినా మీ కోస‌మే. అయితే నా డైరెక్ట‌ర్ ఆ సీన్‌లో న‌టించినందుకు ఆయ‌న‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా ర‌క్తం, చెమ‌ట చిందించి సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్టం ప‌డ్డాం’ అని అన్నారు హీరో రామ్.

సినిమా కోసం హీరోలు ఎంత క‌ష్ట‌ప‌డ‌తార‌నే విష‌యాన్ని మ‌రోసారి రామ్ వివ‌రించారు. ఇప్పుడు ఆయ‌న అభిమానులు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. త‌న క‌ష్టానికి విలువ ఇవ్వాల‌ని అంటున్నారు. స్కంద సినిమాకు మ‌రి రెండో పార్ట్ ఉంది. మ‌రి దీన్ని చిత్రీక‌రిస్తారా? లేదా అని రామ్‌, బోయ‌పాటి చెప్పాలి. మ‌రి బోయ‌పాటి నెక్ట్స్ సినిమాను బాల‌య్య‌తో చేస్తారా? లేక మ‌రెవ‌రితోనైనా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.