English | Telugu
అప్పుడు అగస్త్య, బాల.. ఇప్పుడు దేవ, వరద ఇదీ ‘సలార్’ కథ!
Updated : Dec 2, 2023
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘సలార్‘ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తున్నారో అవన్నీ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రభాస్ చేసిన గత మూడు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో అభిమానులు ‘సలార్’తో మరోసారి చరిత్ర తిరగ రాస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ రూమర్ అభిమానుల్ని కలవరపెడుతోంది.
అదేమిటంటే.. ‘సలార్’ కథ కొత్తదేమీ కాదని, దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడలో చేసిన మొదటి సినిమా ‘ఉగ్రం’ కథతోనే మళ్ళీ ‘సలార్’ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటి అని ఆరా తీస్తే ఉగ్రం సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. చిన్నతనంలోనే అగస్త్య అనే కుర్రాడి తలిదండ్రులు కొందరు దుర్మార్గుల వల్ల చనిపోతారు. అదే సమయంలో తన స్నేహితుడు బాల నుంచి అగస్త్య దూరంగా వెళ్లిపోవాల్సి వస్తుంది. తన సాయం ఏమైనా కావాలా అని అగస్త్యను అడుగుతాడు బాల. అక్కర్లేదు అని చెప్తాడు అగస్త్య. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన అక్కడ నేనుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అగస్త్య.
తాజాగా రిలీజ్ అయిన ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉగ్రం కథనే ప్రశాంత్ నీల్ మళ్ళీ తీస్తున్నాడనే మాటలో నిజం ఉందనే అనిపిస్తోంది. అయితే ఆ సినిమాకి, సలార్ సినిమాకి బ్యాక్‌డ్రాప్ విషయంలో చాలా తేడాలు ఉండొచ్చు. అంతేకాదు, సలార్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా, వరద రాజమన్నార్ రెండో భాగంలో శత్రువులుగా మారతారని తెలుస్తోంది. ‘ఉగ్రం’ కథనే తీసుకున్నప్పటికీ అందులో చాలా మార్పులు జరిగి ఉండొచ్చు. కానీ, ఇది రీమేక్ కదా అనే ఫీల్ అందరికీ రావడంతో సలార్ ఒక కొత్త కథ, కొత్త కాన్సెప్ట్ అనేది ఆడియన్స్‌లో రిజిస్టర్ అయిపోతే ఒక రీమేక్‌నే చూస్తున్నామన్న ఆలోచనతోనే సినిమా చూస్తారు. అయితే ప్రస్తుతం సలార్ కథ విషయంలో జరుగుతున్న అనేక చర్చలను అధిగమించే స్థాయిలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించగలిగితే ఉగ్రం విషయాన్ని అందరూ మర్చిపోతారు. కొన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ‘సలార్’ విషయంలో ప్రశాంత్ ఆ మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాడనే వాదన కూడా వినిపిస్తోంది.