English | Telugu
సలార్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరింది!
Updated : Dec 1, 2023
సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం సీజ్ ఫైర్ ఈ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
నేడు(డిసెంబర్ 1న) రాత్రి 7:19 గంటలకు సలార్ ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం వావ్ అనేలా ఉంది. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు సలార్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరడం ఖాయమనిపిస్తోంది.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల చిన్నప్పటి స్నేహాన్ని చూపిస్తూ సలార్ ట్రైలర్ ప్రారంభమైంది. "నీ కోసం ఎర అయినా అవుతా, సొర అయినా అవుతా. నువ్వు ఎప్పుడు పిలిచినా నీ కోసం ఇక్కడికి వస్తా" అంటూ స్నేహం కోసం ప్రాణమిచ్చే దేవాగా ప్రభాస్ చిన్ననాటి పాత్రను పరిచయం చేశారు. కొన్నేళ్లకి ఖాన్సార్ అనే క్రూర సామ్రాజ్యంలో కుర్చీలాట మొదలుకావడం, కొందరు పృథ్వీరాజ్ ని అంతమొందించాలని చూడటం, ఈ క్రమంలో ప్రభాస్ ఎంటర్ కావడం ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ ఒక్కడే వందల మంది ఉండే ఆర్మీతో సమానం అన్నట్టుగా పవర్ ఫుల్ గా అతని పాత్రను చూపించారు. ట్రైలర్ లో ప్రభాస్ ని చూపించింది చివరి 90 సెకన్లే అయినప్పటికీ, గూస్ బంప్స్ వచ్చేలా చేయగలిగారు. ప్రభాస్ ఎంట్రీ షాట్ కానీ, ఎండింగ్ షాట్ కానీ అదిరిపోయాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే కేజీఎఫ్ ని మించిన ఎలివేషన్స్ తో ప్రభాస్ తో కలిసి ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ ఊచకోత కోయబోతున్నాడని అర్థమవుతోంది.