English | Telugu
పవన్‌కళ్యాణ్‌పై పోలీస్ కేసు.. అలా అయితే మీపై ఎన్ని కేసులు పెట్టాలి?
Updated : Jul 26, 2025
సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం, అనవసరమైన కామెంట్స్, ట్రోలింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా సక్సెస్‌మీట్‌లో అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్‌కళ్యాణ్‌పై కేసు నమోదైంది. హరిహర వీరమల్లు సక్సెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఎందుకు వివాదాస్పదమైంది, ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం.
హరిహర వీరమల్లు సక్సెస్‌మీట్‌లో అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి కామెంట్ గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దమ్ముంటే తిరిగి కొట్టాలి’ అంటూ ఫ్యాన్స్‌కి పిలుపునిచ్చారు. అంతేకాదు, అలాంటి కామెంట్స్‌కి దిమ్మతిరిగే రిప్లై ఇవ్వాలని, నెగెటివ్ కనిపిస్తే వదిలిపెట్టవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్స్‌పై.. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులు చెయ్యాలంటూ అభిమానుల్ని పవన్‌కళ్యాణ్ రెచ్చగొడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ నేతల చర్యలపై పవన్‌కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ నాయకుడు దాడులు చేయమని చెప్పలేదని, వచ్చిన కామెంట్స్‌కి ధీటుగా సమాధానం చెప్పాలని మాత్రమే సూచించారని స్పష్టం చేశారు. ఈ మాత్రం వ్యాఖ్యలకే పవన్‌కల్యాణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలకు సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చారు జనసైనికులు. గతంలో వైసీపీ వారు తమ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారి కార్యకర్తలను తమపై ఉసిగొల్పారు. భౌతికంగా దాడులు చేసేందుకు సిద్ధపడ్డారు. అన్ని దారుణాలు చేసిన వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టాలి, ఎన్ని కేసులు పెట్టాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కూటమి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.