English | Telugu
KGF Actress:‘కెజిఎఫ్’ నటిపై పోలీస్ కేసు... కాపాడిన వీడియో కాల్!
Updated : Nov 4, 2023
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రంలో నటించిన మాళవిక అవినాష్‌కు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చింది. 1988లోనే కెరీర్ స్టార్ట్ చేసిన మాళవిక లెక్కకు మించిన సినిమాల్లో నటించి, పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ‘కెజిఎఫ్’తో తెలుగువారికీ పరిచయమైంది. తాజాగా మాళవిక అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని ట్రాయ్ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ట్రాయ్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ట్రాయ్‌నుంచి ఫోన్ వచ్చింది. నా మొబైల్ నెంబర్‌ను కట్ చేస్తామని చెప్పారు. మరింత సమాచారం కోసం 9కి ఫోన్ చేయమని చెప్పారు. నేను ఫోన్ చేశాను. నా నెంబర్ డిస్కనెక్ట్ చేయవద్దని ట్రాయ్ అధికారుల్ని కోరాను. ఆధార్ కార్డును తప్పుగా వాడి సిమ్ తీసుకోలేదని వారికి చెప్పాను. తర్వాత వారు పోలీసులకు కూడా ఫోన్ కలిపారు. నాతో మాట్లాడిన ఎస్‌ఐ కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు. నన్ను ముంబై వచ్చి కంప్లయింట్ ఇవ్వమన్నాడు. నేను ఓ నటిని అని చెప్పే ప్రయత్నం చేశాను. అతను వినలేదు. నేను వీడియో కాల్ చేసినపుడు నన్ను కేజీఎఫ్ నటి అని గుర్తించాడు. వెంటనే నాకు అండగా నిలిచాడు. నా స్టేట్‌మెంట్ రికార్డు చేయాలన్నాడు. స్టేట్‌మెంట్ కోర్టు ముందు ఉంచుతామని ఆ పోలీస్ చెప్పాడు. దీన్ని బట్టి ఆధార్ కూడా పాస్ పోర్టులా చాలా ముఖ్యమైందని అర్థమైంది’ అన్నారు.