English | Telugu

SBI బ్యాంక్‌ పోర్టల్‌లో పైరసీ సినిమాలు.. షాక్‌ అయిన ఇండస్ట్రీ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా పైరసీ సినిమాల వార్తలు, ఐబొమ్మ ఇష్యూ కనిపిస్తున్నాయి. దీని గురించి వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి షాక్‌ ఇచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎస్‌బిఐ ఇన్సూరెన్స్‌ పోర్టల్‌లో పైరసీ సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ పోర్టల్‌లో వివిధ పేజీలను ఓపెన్‌ చేసినపుడు ఐబొమ్మ పేరును వాడుకుంటున్నాయి కొన్ని పైరసీ వెబ్‌సైట్లు.

ఇప్పటికే ఉన్న కొన్ని పైరసీ సైట్లను ఐబొమ్మగా పేరు మార్చారు. వాటిపై క్లిక్‌ చేస్తే తమ పైరసీ సైట్‌కి రీడైరెక్ట్‌ అయ్యేలా సెట్‌ చేశారు. అలా ఐబొమ్మ ప్లస్‌ అనే సైట్‌ని క్లిక్‌ చేస్తే అది మూవీ రూల్జ్‌ సైట్‌ ఓపెన్‌ అవుతోంది. ఓపక్క ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని అన్ని వివరాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఐబొమ్మ కోసం సెర్చ్‌ చేసే వాళ్ళకు ఐబొమ్మవన్‌ పేరుతో మరో వెబ్‌సైట్‌ దర్శనమిస్తోంది. ఐ బొమ్మను క్లోజ్‌ చేసిన తర్వాత ఐబొమ్మవన్‌ సైట్‌ను ఎవరు క్రియేట్‌ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సైట్‌లో క్లిక్‌ చేస్తే అది మూవీ రూల్జ్‌కి రీ డైరెక్ట్‌ అవుతోంది. ఐబొమ్మ కంటే మూవీ రూల్జ్‌లోనే కొత్త సినిమాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే ఈ సైట్‌లో అప్‌లోడ్‌ చేసేస్తారు. ఇమ్మడి రవి అరెస్ట్‌తో సమసిపోయిందనుకున్న సమస్య ఇప్పుడు బ్యాంక్‌ పోర్టల్స్‌ వరకు వెళ్ళడం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురి చేస్తోంది.