English | Telugu

‘రాజా ది గ్రేట్‌’ సినిమాను మిస్‌ చేసుకున్న హీరోతో అనిల్‌ రావిపూడి సినిమా?

పటాస్‌తో డైరెక్టర్‌గా పరిచయమైన అనిల్‌ రావిపూడి.. ఇప్పటి వరకు 8 సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. రాజమౌళి తర్వాత ఫ్లాప్‌ లేని డైరెక్టర్‌గాఅనిల్‌ రావిపూడి కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత రామ్‌ పోతినేనితో అనిల్‌ ఒక సినిమా చేయబోతున్నారనే వార్త వినిపిస్తోంది.

వాస్తవానికి రామ్‌, అనిల్‌ కాంబినేషన్‌లో పదేళ్ళ క్రితమే ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అయితే అదే కథను రవితేజకు వినిపించి సినిమా సెట్‌ చేసుకున్నారు అనిల్‌. అదే రాజా ది గ్రేట్‌. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా మొదట రామ్‌తో అనుకోవడానికి కారణం.. అతను హీరోగా నటించిన కందిరీగ చిత్రానికి అనిల్‌ రచయితగా పనిచేయడమే.

అప్పుడు మిస్‌ అయిన ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా గురించి అనిల్‌ రావిపూడి స్పందిస్తూ ‘మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియదుగానీ ఎప్పుడు వచ్చినా బద్దలవుతుంది’ అన్నారు. ఈ కాంబోలో సినిమా కోసం రామ్‌ అభిమానులు, అనిల్‌ రావిపూడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్‌బాబు కాంబినేషన్‌లో రామ్‌ చేసిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రం నవంబర్‌ 27న విడుదల కాబోతోంది.

ఇప్పటికే వరస ఫ్లాపుల్లో వున్న రామ్‌.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రంపై ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నాడు. సినిమా కూడా దానికి తగ్గట్టుగానే బాగా వచ్చిందనే టాక్‌ వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న రామ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే మెగాస్టార్‌తో అనిల్‌ చేస్తున్న సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కాబోతోంది. రామ్‌ సినిమా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీన్నిబట్టి రామ్‌, అనిల్‌ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.