English | Telugu

'మాన్షన్ 24' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: మాన్షన్ 24
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, సత్య రాజ్, అవికా గోర్, బిందు మాధవి, నందు తదితరులు
డైలాగ్స్: మయూఖ్ ఆదిత్య
ఎడిటింగ్: ఆది నారాయణ్
సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
సంగీతం: వికాస్ బడిస
నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్

హారర్ థ్రిల్లర్ జానర్ ని వీక్షించే అభిమానులు ఎక్కువే ఉన్నారు. ఓంకార్ దర్శకత్వలో వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'మాన్షన్ 24'. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ:
ఒక పాతపడిన మాన్షన్ లో అమృత అనే అమ్మాయి గాయాలతో పడి ఉంటుంది. ఇక తన ఊపిరి ఆగిపోతుందని , చనిపోయే ముందు తన గతం చెప్తుంది. అమృత తన నాన్న కనపడటం లేదని పోలీసులు కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత తన నాన్న పనిచేసే పురావస్తు తవ్వకాల డిపార్ట్మెంట్ కి వెళ్లి అడుగగా.. అక్కడ తనికి ఒక నిజం తెలుస్తుంది. అతను చివరగా ఆ పాతపడ్డ మాన్షన్ కి వెళ్ళాడని అమృత తెలుసుకుంటుంది. అయితే అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదమని, అక్కడికు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని అమృత చాలా వింటుంది. అయితే అమృత మాత్రం వాళ్ళ నాన్న కోసం ఆ మాన్షన్ కి వెళ్తుంది‌. అక్కడ ఒక వాచ్ మెన్ ఉంటాడు. అతను ఆ మాన్షన్ చాలా ప్రమాదమని తన అనుభవాలని, తను విన్న కథలని చెప్తుంటాడు. మరి అమృత వాళ్ళ నాన్న దొరికాడా? ఈ క్రమంలో అమృతకి ఎదురైన సవాళ్ళేంటి? అసలు వాచ్ మెన్ ఎవరు? తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
అమృత అనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్.. వాళ్ళ నాన్న కనపడటం లేదనే ఇంటెన్స్ తో ఈ కథని ఎత్తుకున్న విధానం బాగుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఎలా మిస్ అయ్యాడనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది అమృత. అయితే తను ఆ పాతపడ్డ మాన్షన్ కి వెళ్ళి అక్కడ వాచ్ మెన్ (రావు రమేశ్) చెప్పే కథలన్నీ విని అవన్నీ వట్టి కథేలనని అతనికి చెప్తుంది.

అయితే వాచ్ మెన్ చెప్పే కథలన్నీ ఒక్కో ఎపిసోడ్ గా మలిచాడు డైరెక్టర్ ఓంకార్. మొదటి ఎపిసోడ్ '504' క్యారెక్టర్లని పరిచయం చేస్తూ 504 గదిలో జరిగిన సంఘటనని వివరిస్తాడు. ఆ తర్వాత 203, 605, 409, 307 ఇలా వరుసగా ఆ పాతపడ్డ మాన్షన్ లలోని గదులలో ఉన్న వ్యక్తులు, వాళ్లు ఎలా కనుమరుగయ్యారో అక్కడి వాచ్ మెన్ అమృతతో చెప్పే సీక్వెన్స్ బాగుంటుంది. అయితే ఈ క్రమంలో డైరెక్టర్ ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఇంటెన్స్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఒక దశలో కథలు వినడానికే అమృత ఆ పాతపడ్డ మాన్షన్ కి వెళ్తుందా అనే డౌట్ ప్రేక్షకుడికి అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్ వరకు ఇదే జరుగుతుంది.

ఆయితే చివరి ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ లు కాస్త ఆసక్తిని కలుగజేస్తాయి. కానీ ప్రతీ ఎపిసోడ్ కి కథని లింక్ చేయడంలో డైరెక్టర్ ఓంకార్ పూర్తి స్థాయలో విజయం సాధించలేదు. అతని ముందు సినిమాల్లోని 'రాజు గరి గది' సీక్వెన్స్ లా అనిపిస్తుంటాయి. బిజిఎమ్ బాగుంటేనే హర్రర్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది‌. ఈ వెబ్ సిరీస్ లో అక్కడ అక్కడ వచ్చే బిజిఎమ్ అంతగా భయాన్ని, ఇంటెన్స్ ని క్రియేట్ చేయలేకపోయాయి.

ఈ కథని వివరించిన తీరు బాగున్నా.. మెయిన్ పాయింట్ ని పక్కన పెట్టి, ఎవరెవరో వస్తుంటారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కథ అన్నట్టు లెక్కలేసుకొ‌ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ ఓంకార్. ప్రేక్షకుడిని చివరి వరకు ఇంటెన్స్ తో కూర్చోబెట్టలేకపోయాడు. మొదటి ఎపిసోడ్, చివరి ఎపిసోడ్ తప్ప మధ్యలోని ఎపిసోడ్ లన్ని డొల్ల అన్నట్టుగా ఉంటాయి. అక్కడక్కడ చిన్న పిల్లలని దెయ్యాలుగా చూస్తుంటే.. అతని ముందు సినిమాలని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అసభ్య పదజాలం ఏమీ లేదు. అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ ఉండటం, దెయ్యాన్ని చూపించే ఒకటి రెండు సీన్లు మినహా మిగతాదంతా బాగుంటుంది. మయూఖ్ ఆదిత్య డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వికాస్ అందించిన బిజిఎమ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆది నారాయణ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ కథని లీడ్ చేసిన విధానం ప్రధాన బలంగా నిలిచింది. కథలు చెప్పే మాన్షన్ వాచ్ మెన్ పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ సిన్సియర్ ఆఫీసర్ గా, బిందు మాధవి, అవికా గోర్, అయ్యప్ప పీ శర్మ, మానస్, అమర్ దీప్, నందు వారి వారి పాత్రలలో చక్కగా నటించారు. ఇక మిగిలిన వాళ్ళు పాత్రల పరిధి మేరకు నటించారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
హారర్ థ్రిల్లర్ ని ఇష్టపడేవారికి ఈ సిరీస్ సాధారణంగా అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే, కామన్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలున్నాయి.

రేటింగ్: 2.75/5

✍🏻. దాసరి మల్లేశ్