English | Telugu
'లేబుల్' వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Nov 10, 2023
వెబ్ సిరీస్: లేబుల్
నటీనటులు: జై, తాన్య హోప్, మహేంద్రన్
ఎడిటింగ్: రాజా అరుముగమ్
మ్యూజిక్: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
నిర్మాతలు: ఎ. జె ప్రభాకరన్
రచన, దర్శకత్వం: అరుణ్ రాజా కామరాజ్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
చిన్న సినిమాలకి, వెబ్ సిరీస్ లకి ఓటీటీ వేదికలే సరైనవి. రాజా రాణి ఫేమ్ జై నటించిన తొలి వెబ్ సిరీస్ 'లేబుల్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కథేంటో ఒకసారి చూసేద్దాం.
కథ:
ఒక స్కూల్ గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు ఫుట్ బాల్ ఆడుకుంటారు. అదే గ్రౌండ్ లో వర్కవుట్ చేసుకుంటున్న ఒక అతడిని కొంతమంది కుర్రాళ్ళు చుట్టుముట్టి అతన్ని అతి దారుణంగా నరికి చంపేస్తారు. ఇదంతా ఒక కుర్రాడు అలానే చూస్తుంటాడు. అలా ఎవరో తెలియని వ్యక్తిని చంపుతుండటం చూసిన ఆ కుర్రాడిని కూడా పోలీసులు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో వాలిపురం అనే ఏరియాకి సంబంధించిన కుర్రాడని తెలుస్తుంది. దాంతో అతడిని పోలీస్ స్టేషన్ లోని ఉంచుతారు. మరి వాలీపురం కుర్రాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ కుర్రాడు బయటకు వచ్చాడా? జైలుకెళ్ళి బయటకొచ్చిన ఆ కుర్రాడు ఏం అయ్యాడనేది కథ..
విశ్లేషణ:
స్కూల్ గ్రౌండ్ లో ఒక అతడిని చంపేసి కథని ఎత్తుకున్న తీరు బాగుంది. ఆ తర్వాత కథలోని క్యారెక్టర్ లని పరిచయం చేశాడు డైరెక్టర్.
ఒక ఏరియాలో జరుగుతున్న క్రైమ్స్, అక్కడ ఉండే క్రిమినల్స్ ని బట్టి అక్కడ ఉండేవాళ్ళంతా అలానే ఉంటారంటూ బయట టాక్ నడుస్తుండగా దానిని మార్చడానికి ప్రభా(జై) ఏం చేశాడనేది కథ. దీని కోసం జై చేసిన ప్రయత్నం బాగుంటుంది. రంగు, డబ్బుని బట్టి ఒక మనిషి క్యారెక్టర్(లేబుల్) ని ఎలా డిసైడ్ చేస్తారు. అలా అనుకుంటున్నవారికి, అది కరెక్ట్ కాదని చెప్పే విధానం బాగుంటుంది. అయితే లాయర్ చదివిన ప్రభా(జై) కి కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఓ కొత్త సమస్య ఎదురవుతుంది. దానిని అతను అతిక్రమించాడా లేదా అనేది బాగుంది.
కథనం మొత్తం గ్యాంగ్, మర్డర్, బ్లడ్ అంటూ ఎక్కువగా వయలెన్స్ తో సాగుతుంది. సెన్సిటివ్ ఆడియన్స్ కి ఇది కాస్త తలనొప్పిని తెప్పిస్తుంది. అయితే మాస్ ఆడియన్స్ ఇలాంటి వాటిని ఇప్పటికే చాలా చూసి ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు 'మధగం' లా అనిపిస్తుంది. మధగం ఈ మధ్యే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ హీరో పోలీస్.. ఇక్కడ లాయర్. అంతే తేడా.. అదే ఇన్వెస్టిగేషన్, అవే గ్యాంగ్ వార్స్. డ్రగ్స్, డబ్బుల కోసం గొడవలు.. వీటన్నింటి మధ్యలో ప్రభా(జై) తన ఐడెంటిటీ లేబుల్ ని ఎలా మార్చుకున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం మూడు ఎపిసోడ్ లుగా రిలీజ్ చేశారు మేకర్స్. మొత్తం పది ఎపిసోడ్లుగా రానుంది. సామ్ సి. ఎస్ బిజిఎమ్ బాగుంది. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. రాజా అరుముగమ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ప్రభాగా జై క్యారెక్టర్ కొత్తగా ఉంది. ఇంతవరకు సింపుల్ అండ్ కూల్ గా కనిపించే 'జై' ని మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించారు. తాన్య హోప్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా పర్వాలేదు. మహేంద్రన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు వారి పరిధి మేరకు బాగా నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఒక మనిషిని రంగు, డబ్బుని బట్టి ఒక 'లేబుల్' ఇచ్చే సమాజానికి అది తప్పు అని చెప్తూ తీసిన ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.5/5
✍🏻. దాసరి మల్లేశ్
