English | Telugu

17 ఏళ్ళు తన చుట్టూ తిప్పుకున్నారు.. నాగార్జునపై కాదంబరి సంచలన వ్యాఖ్యలు

17 ఏళ్ళు తన చుట్టూ తిప్పుకున్నారు.. నాగార్జునపై కాదంబరి సంచలన వ్యాఖ్యలు

కాదంబరి కిరణ్‌ కుమార్‌ గురించి అందరికీ తెలుసు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. దాదాపు 250 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. కెరీర్‌ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో ఎక్కువ కనిపించిన కాదంబరి స్వయంగా టీవీ సీరియల్స్‌ను కూడా నిర్మించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ‘మనం సైతం’ అనే స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద కళాకారులకు ఆదుకుంటున్నారు. అంతేకాదు, లాక్‌డౌన్‌ సమయంలో కాదంబరి చేసిన సేవా కార్యక్రమాలను అందరూ ప్రశంసించారు. 

ఇదిలా ఉంటే ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెబుతూ మధ్యలో అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నాగార్జునపై కాదంబరి చేసిన వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఆ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి కాదంబరి కిరణ్‌కుమార్‌ ఏం మాట్లాడారో చూద్దాం... ‘నేను చాలా సీరియల్స్‌ నిర్మించాను. ఏదైనా కొత్త ఛానల్‌ వస్తే అందులో నా సీరియల్‌ తప్పనిసరిగా ఉండేది. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ 250 సినిమాల్లో నటించినా నాకు ఆశించినంత పేరు రాకపోవడానికి కారణం అది నా ఫేట్‌. ఒకప్పుడు నాగార్జున ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కథ చెప్పాను. అది ఒక మిరాకిల్‌ అనే చెప్పాలి. ఎందుకంటే అయన ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కూర్చోపెట్టి కథ చెప్పడం మామూలు విషయం కాదు. నాగార్జున కథ విని రెండు సన్నివేశాల్లో కరెక్షన్స్‌ చెప్పారు, ఆ రెండు కరెక్షన్స్‌ చేసుకొని మళ్ళీ కథ చెప్పడానికి 17 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. కానీ, ఇప్పటివరకు నా కథ మళ్ళీ వినలేదు. ఆ తర్వాత నాగార్జునతో ‘బావ’ సినిమా చెయ్యాల్సింది.  కానీ,  మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే అది కూడా నా ఫేటే. కొంతమందికి కొన్ని వర్కవుట్‌ అవుతాయి, కొంతమందికి అవ్వవు. అంతే. నాగార్జున నాకు ఛాన్స్‌ ఇవ్వనంత మాత్రాన నాకు పోయేది ఏమీ లేదు. నేను కాదంబరి కిరణ్‌గా వున్నాను. తర్వాత రమ్యకృష్ణతో ‘గజ్జెల గుర్రం’ చెయ్యాల్సింది అది కూడా అవ్వలేదు. సిమ్రాన్‌తో కూడా ఒక సినిమా అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఉషా కిరణ్‌ మూవీస్‌ బేనర్‌లో బాబుమోహన్‌ కొడుకుతో, బ్రహ్మానందంతో ఒక సినిమా అనుకున్నాను. అది కూడా సెట్స్‌పైకి రాలేదు. అదంతా నా తలరాత తప్ప మరేమీ కాదు. 

టీవీలో సీరియల్స్‌ చేస్తున్న సమయంలో నాగేశ్వరరావుగారితో పరిచయమైంది. ఆయనతో సాన్నిహిత్యం బాగా పెరిగింది.  అసలు ఒక సమయంలో నాగార్జునగారు కూడా నన్ను పిలిచి నాన్నతో టీవిలో ఒక ప్రోగ్రాంకి యాంకరింగ్‌ చేయిస్తే బాగుంటుంది అన్నారు. యాంకరింగ్‌ అంటే నాగేశ్వరరావుగారు పళ్ళు రాలగొడతారు అని చెప్పాను. అయితే ఆ తర్వాత నాగేశ్వరరావుగారితో మాట్లాడుతూ ఒక సందర్భంలో మీ అనుభవాలు చలన చిత్ర పరిశ్రమలో ఒక ‘లైబ్రరీ ఫిలిం’ అవుతుంది అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. నాగేశ్వరరావుగారే దానికి ‘గుర్తుకొస్తున్నాయి’ అనే టైటిల్‌ పెట్టి చేద్దాం అని చెప్పారు. అప్పుడు నాగార్జున వేరే యాంకర్‌ని పెట్టి నన్ను కట్‌ చేసేసారు. నాగార్జున వ్యాపారాత్మకంగా చూసారు, నన్ను కట్‌ చేశారు. అలాగే నాగార్జునకి నేను ఇంట్లో కథ చెప్పడంతో నాకు టాలెంట్‌ వుంది అని నాగార్జున సన్నిహితుడు అన్నారు. నన్ను పొగుడుతున్నాడేమో అనుకున్నాను, కానీ,  తర్వాత తెలిసింది అక్కడ కూడా నన్ను కట్‌ చేశారని. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల నేను ఫెయిల్‌ అయ్యానంటే అది నా ఫేట్‌ అనే అనుకుంటున్నాను’ అన్నారు.