English | Telugu

‘భోళా శంకర్’కి జ‌గ‌న్ స‌ర్కార్ వేటు!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 11న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏపీ స‌ర్కార్‌కి టికెట్ రేట్స్‌ను పెంచుకునే విష‌యంలో రిక్వెస్ట్‌ను పంపారు. రూ.25 పెంచుకునే వెసులుబాటుని క‌ల్పించాలనేది చిత్ర నిర్మాత‌ల నుంచి ఏపీ స‌ర్కార్‌కి వెళ్లిన విన‌తి. అయితే ‘భోళా శంకర్’కు ఏపీ ప్ర‌భుత్వం షాకిచ్చింది. అయితే దీన్ని ముందుగానే ఊహించామ‌ని కొంద‌రు అంటున్నారు. అందుకు కార‌ణం.. రెండు రోజుల ముందు జ‌రిగిన వాల్తేరు వీర‌య్య 200 డేస్ ఫంక్ష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ అంటున్నారు.

ఏపీ ప్ర‌త్యేక హోదాను సాధించ‌టంతో పాటు రోడ్లు ఇత‌ర‌త్రా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చ‌కుండా పిచ్చుక‌పై బ్ర‌హ్మాస్త్రంలా సినీ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేస్తున్నారంటూ వై.ఎస్‌.జ‌గ‌న్ స‌ర్కారుని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్య‌లు చేయ‌టం దుమారం రేపింది. ఏపీ ప్ర‌భుత్వానికి చెందిన మంత్రులు, రాజ‌కీయ నాయ‌కులు చిరంజీవిపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. దాని ఫలిత‌మే ‘భోళా శంకర్’ సినిమాకు టికెట్ రేట్స్‌ను పెంచుకునేలా జీవోను జారీ చేయలేద‌ని అంటున్నారు. అయితే ఈ వార్త‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు తోసి పుచ్చుతున్నారు.

‘భోళా శంకర్’ సినిమా యూనిట్ టికెట్ రేట్స్‌ను పెంచుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను కొన్నింటిని జ‌త చేయ‌లేద‌ని, వాటిని అందించాల‌ని కోరినా అంద‌లేద‌ని అందుక‌నే వారి విన‌తిని రిజెక్ట్ చేస్తున్న‌ట్లు వారు తెలిపారు. త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా ‘భోళా శంకర్’ సినిమా రూపొందింది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా న‌టిస్తే, త‌మ‌న్నా హీరోయిన్‌గా నటించింది.