English | Telugu

రాజ‌మౌళికి ర‌మ్య‌కృష్ణ కండీష‌న్స్‌

ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స‌క్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌టానికి పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్స్ అంద‌రూ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. అయితే రాజ‌మౌళితో సినిమా చేయ‌ట‌మంటే అంత సులువు కాదు. ఎందుకంటే.. కండీష‌న్స్ చాలానే ఉంటాయి. ఆయ‌న సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మెయిన్ రోల్స్‌లో చూసే వారు స‌ద‌రు పాత్ర‌ల గురించి మాట్లాడ‌కూడ‌దు. లుక్స్‌ని బ‌య‌ట‌కు రివీల్ చేయ‌కూడ‌దు. ఇన్నీ నియ‌మాలున్నా జ‌క్క‌న్న‌తో సినిమా చేయ‌టానికి స్టార్స్ రెడీగానే ఉంటారు. అయితే అలాంటి డైరెక్ట‌ర్‌కే ఒక‌రు కండీష‌న్స్ పెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఆ కండీష‌న్స్‌కి ఆయ‌న కూడా ఓకే చెప్పారు మ‌రి. ఇంత‌కీ రాజ‌మౌళికే కండీష‌న్స్ పెట్టిన వ్య‌క్తి ఎవ‌రో కాదు.. ర‌మ్య‌కృష్ణ‌.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి చిత్రంలో మ‌హీష్మ‌తి రాజ‌మాత పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించింది. ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి శ‌భాష్ అనిపించుకుంది. ఇప్పుడామె జైల‌ర్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో మాట్లాడుతూ బాహుబ‌లిలో రాజ‌మౌళికి పెట్టిన కండీష‌న్స్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ఇంత‌కీ రాజ‌మౌళికి ర‌మ్య‌కృష్ణ పెట్టిన కండీష‌న్స్ ఏంటంటే.. రాత్రిపూట షూటింగ్ చేయ‌న‌ని, ఎక్కువ రోజులు స‌మ‌యం కేటాయించ‌లేన‌ని.. అందుకు జ‌క్క‌న్న ఒప్పుకుని ర‌మ్య‌కృష్ణ‌తో చ‌క‌చ‌కా షూటింగ్‌ను పూర్తి చేశార‌ట‌.

ఈ క్ర‌మంలో ర‌జినీకాంత్‌, చిరంజీవి వంటి స్టార్స్ గురించి చాలా కొద్ది మంది మాత్ర‌మే అలాంటి స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకుంటార‌ని అన్నారామె. భ‌విష్య‌త్తులో వారిలా ఎంత మంది స్టార్స్ వ‌స్తారో త‌న‌కు తెలియ‌ద‌ని, వచ్చినా వారిలా స్టార్ డమ్‌ను అంత కాలం కొనసాగించటం కష్టమని ఆమె పేర్కొన్నారు.