English | Telugu
కాలేజీలో ప్రకాష్ రాజ్.. గోమూత్రంతో క్లీన్ చేసిన విద్యార్థులు
Updated : Aug 10, 2023
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కి అనుకోని షాక్ తగిలింది. శివమొగ్గ జిల్లా భద్రావతిలో సర్ ఎంవీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సోసైటీ అనే అంశాలపై ఒక చర్చా వేదిక జరిగింది. ఇందులో మన వెర్సటైల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈవెంట్‌ను ఫెడరేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ సంస్థ నిర్వహించింది. అయితే ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దాన్ని స్కూల్‌లో ఎలా నిర్వహిస్తారని కొందరు విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రకాష్ రాజ్‌కి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ విద్యార్థులకు బీజేపీ నేతలు మద్దతుని తెలియజేశారు. అయితే పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
చర్చా కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రకాష్ రాజ్ వెళ్లిపోయారు. ఆయన నడిచిన వెళ్లిన ప్రదేశాన్ని, కూర్చున్న ప్రాంతాన్ని విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. విద్యార్థులు ఇలా గోమూత్రంతో ప్రాంతాన్ని క్లీన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా దయ్యబట్టారు. దీంతో ఆయన పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కొందరు విద్యార్థులు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు.
చర్చా కార్యక్రమం అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మనకు ద్వేషం వద్దు, ప్రేమ కావాలి. అందరూ సమానమే. క్రూరత్వం, వ్యతిరేకత దేశ నాశనానికి దారి తీస్తుంది. నరేంద్ర మోడీ ప్రణాళికలు మన దేశంలో విఫలమయ్యాయి. త్వరలోనే ఆయన పాలన ముగుస్తుంది. ఆయన దేవుడేమీ కాదు.. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది’’ అన్నారు. తన కార్యక్రమంలో విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతి ఘటనపై ఆయన స్పందించలేదు.