English | Telugu

అనుష్క డబుల్ రెమ్యూనరేషన్!

అరుంధతితో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న అనుష్క తర్వాత బాహుబలి, భాగమతి చిత్రాలతో తన ఇమేజ్, క్రేజ్ ను పెంచుకుంది. అయితే తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. సైజ్ జీరో సినిమా కారణంగా పెరిగిన బరువు ఆమె తగ్గించుకోవటంలో భాగంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తనకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తోంది. తాజాగా ఆమె స్క్రీన్ పై సందడి చేసి మూడేళ్లు అవుతోంది. 2020లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. కానీ సినిమాను చూసిన వాళ్లందరూ అబ్బే అనేశారు. ఆ తర్వాత ఆమె మరో సినిమాలో నటించలేదు.

దాదాపు మూడేళ్ల తర్వాత అనుష్క నటించిన కొత్త సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి. అనుష్కకు జోడీగా నవీన్ పొలి శెట్టి నటించారు. మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా యువీ క్రియేషన్స్ సినిమాను నిర్మించింది. ఆగస్ట్ రిలీజ్ అని ముందుగా ప్రకటించినప్పటికీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అనుష్క రెమ్యూనరేషన్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది.

అదేంటంటే.. సాధారణంగా అనుష్క తన సినిమాలకు ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మూడు కోట్ల మేరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ.. మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాకు మాత్రం ఆమె ఏకంగా ఆరు కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది. అనుష్కతో అప్పటికే భాగమతి వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన యువీ క్రియేషన్స్ ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తర్వాతే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ , ఇటు అనుష్క ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి.