English | Telugu
Anchor Anasuya: పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్‌కి సారీ చెప్పిన అనసూయ!
Updated : Nov 4, 2023
అనసూయకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు కొందరితో వివాదాలు కూడా ఉన్నాయి. అయితే తాను ఏదైనా సూటిగా మాట్లాడతానని, అందుకే తనంటే కొందరికి ఇష్టం వుండదని చెప్పింది. తను షూటింగ్స్‌లో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడనని, తన పనేదో తాను చేసుకొని వెళ్ళిపోతానని అంటోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటానని, అందుకే హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలు కూడా చేజారాయని చెబుతోంది. పార్టీలకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయంటే అలాంటివి తను ప్రోత్సహించనని అంటోంది.
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఒక పాటలో నటించే అవకాశం వచ్చినా నో చెప్పానని అంటోంది అనసూయ. దానికి కారణం ఆ సినిమాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారని, ఆ గుంపులో నటించడం ఇష్టం లేకే ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెబుతోంది. అంత మంచి అవకాశాన్ని వదులుకున్నందుకు తనని చాలా మంది విమర్శించారని చెప్పింది. తాను ఆ ఆఫర్‌కు నో చెప్పడం తప్పు కాదు. చెప్పిన విధానం తప్పు అని తనకు తర్వాత తెలిసింది. తన తప్పు తెలుసుకొని తర్వాత త్రివిక్రమ్‌కి సారీ చెప్పానని తెలియజేసింది. ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని, ఏ తరహా పాత్ర చేసినా గుర్తింపు తెచ్చుకోగలను అనే నమ్మకం కలిగిందని అంటోంది. అలాగే సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నెటిజన్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి ఇంటిలోని మహిళలను తలుచుకుంటే తనకు జాలి వేస్తుందని, ఈ విషయంలో తన భర్త తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. సోషల్ మీడియాలో చాలా మంది తనను విమర్శిస్తూ వుంటారని, అయితే తనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళే వారు కూడా వుంటారని తెలియజేసింది.