English | Telugu
అతనితో హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలి.. చిరంజీవి నిర్మాతల సంచలన ప్రకటన!
Updated : Jul 3, 2025
సినీ పరిశ్రమలో అవకాశాలు ఇచ్చే వారి కంటే.. అవకాశాల పేరుతో మోసాలు చేసే వారే ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుతో హీరోయిన్లను సంప్రదిస్తున్న ఓ వ్యక్తి బాగోతం వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యు.వి. క్రియేషన్స్ ఒకటి. ప్రస్తుతం చిరంజీవితో 'విశ్వంభర' అనే భారీ సినిమా చేస్తోంది. అలాంటి యు.వి. క్రియేషన్స్.. తాజాగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఒక వ్యక్తి యు.వి. క్రియేషన్స్ కి చెందిన వాడినని చెబుతూ హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అతనితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మా సినిమాల నటీనటుల ఎంపికకు సంబంధించి ఏదైనా ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాం. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మా సంస్థ పేరుని ఉపయోగించుకోవడాన్ని మేముగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తగు చర్యలు తీసుకుంటాం." అంటూ యు.వి. క్రియేషన్స్ తమ ప్రకటనలో పేర్కొంది.
'విశ్వంభర'లో ఒక ప్రత్యేక గీతం చిత్రీకరించాల్సి ఉంది. మరి ఆ సాంగ్ పేరుతో ఎవరైనా హీరోయిన్లను సంప్రదిస్తున్నారా? లేక ఏదైనా కొత్త సినిమా చేస్తున్నామని చెప్పి యూవీ పేరుని వాడుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది.