English | Telugu
అలాంటి పాత్రతో రోజా రీ ఎంట్రీ.. తెలుగు ఆడియన్స్ ఏం చేయనున్నారు?
Updated : Nov 6, 2025
పదేళ్ల తర్వాత రోజా రీ ఎంట్రీ
డీ గ్లామర్ రోల్ తో సర్ ప్రైజ్
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?
సినీ రంగంలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా (RK Roja).. రాజకీయాల్లోనూ రాణించారు. రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. దశాబ్దం పాటు సినిమాలకు దూరమయ్యారు. టీవీ షోలలో మాత్రం బాగానే మెరిశారు. అలా రాజకీయాలతో సినిమాలకు దూరమైన రోజా, ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా డీ గ్లామర్ రోల్ తో కావడం విశేషం.
1991లో వచ్చిన 'ప్రేమ తపస్సు' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టిన రోజా.. వరుస సినిమాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్ర వేశారు. అలాంటి రోజా.. రాజకీయాల్లోకి వెళ్ళి, సినిమాలకు దూరమయ్యారు. తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన 'D/O వర్మ' కాగా, తమిళ్ లో ఆమె చివరి చిత్రం 2015లో వచ్చిన 'ఎన్ వళి తని వళి'. అలా పదేళ్ళుగా నటనకు దూరమైన రోజా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.
డీడీ బాలచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'లెనిన్ పాండ్యన్' అనే తమిళ సినిమాతో రోజా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా ఆమె లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. సంతానం అనే డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు రోజా. పేద కుటుంబానికి చెందిన వయసైపోయిన పెద్దావిడలా కనిపిస్తున్నారు. బయట చీరకట్టు, గంభీరమైన మాట తీరుతో పవర్ ఫుల్ గా కనిపించే రోజాను.. ఈ పాత్రలో ఆడియన్స్ ఎలా రివీస్ చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే, రోజా తన రీ ఎంట్రీ కోసం తెలుగుని కాకుండా తమిళ్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది.
Also Read: 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ రివ్యూ!
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లో, అందునా మంత్రిగా ఉన్నప్పుడు.. మెగా, నందమూరి కుటుంబాలతో పాటు ఎందరో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ రోజా దారుణ విమర్శలు చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. సినీ అభిమానుల్లోనూ ఆమె పట్ల వ్యతిరేకత కనిపించింది. అందుకే, తెలుగునాట నటిగా మునుపటి ఆదరణ ఉండకపోవచ్చనే ఉద్దేశంతోనే.. రోజా తన రీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ని కాకుండా కోలీవుడ్ ని ఎంచుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చూద్దాం మరి, రీ-ఎంట్రీ రోజాకు ఏ మేరకు కలిసొస్తుందో. ఒకవేళ ఆ సినిమా తెలుగులోకి డబ్ అయితే.. ఇక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.