English | Telugu

వీరమల్లు బాటలో కింగ్‌డమ్‌.. షాక్ తప్పదా..?

పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తాజాగా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా విడుదల గురువారం(జూలై 24) కాగా, బుధవారం(జూలై 23) రాత్రి నుంచే షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రీమియర్ షోలు ఫుల్ అయ్యి.. భారీ ఓపెనింగ్స్ కి పునాది పడింది. ఇప్పుడిదే బాటలో 'కింగ్‌డమ్‌' (Kingdom) అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'కింగ్‌డమ్‌' మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇండియాలో జూలై 30 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దానికి కారణం కంటెంట్ పై ఉన్న నమ్మకమే అని అంటున్నారు.

విజయ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. అందుకే ఆయన గత చిత్రాల స్థాయిలో 'కింగ్‌డమ్‌'పై భారీ హైప్ లేదనే మాట వినిపిస్తోంది. అయితే ఇదే తమకు కలిసొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారట. 'లైగర్' వంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి.. దారుణంగా నిరాశపరిచాయి. 'కింగ్‌డమ్‌' విషయంలో అది రివర్స్ అవుతుందని నిర్మాతలు అనుకుంటున్నారట. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. కంటెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందనేది వారి నమ్మకమట. అదే కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ కి సైతం రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపుకి అనుమతి లభించింది. ఇక మేకర్స్ నమ్మకం నిజమై.. ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.