English | Telugu

నీకు సాయం చేయలేకపోవచ్చు..అజిత్ సంచలన స్పీచ్ 

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్న అజిత్(Ajith Kumar)రెండున్నర దశాబ్దాల క్రితమే 'ప్రేమలేఖ' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రీసెంట్ గా గత నెలలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి తమిళంతో పాటు తెలుగులోను మంచి విజయాన్ని అందుకున్నాడు. కారు రేసింగ్ లోను విశేష ప్రతిభ కనపర్చే అజిత్ ఈ ఏడాది జనవరిలో దుబాయ్ లో జరిగిన 24 హెచ్ కారు రేసింగ్ పోటీల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రీసెంట్ గా అజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు ఎంతో ఇష్టమైన రేసింగ్ అయ్యే ఖర్చుని నా చిన్నతనంలో అమ్మ, నాన్న భరించలేకపోయారు. కానీ నా ఇష్టానికి ఎదురుచెప్పలేదు. రేసింగ్ వైపు వెళ్తానని చెప్పగానే మా నాన్న నాతో మాట్లాడుతు రేసింగ్ చాలా ఖరీదైన ఆట. నేను నీకు సాయం చేయలేకపోవచ్చు. కానీ నువ్వే స్పాన్సర్స్ ని వెతుక్కొని కొనసాగించు,పూర్తిగా సహకరిస్తాం. సమయాన్ని వృధా చెయ్యకుండా, డిగ్రీ పూర్తి చెయ్యడమో లేక ఏదైనా పని చేసుకుంటూ రేసింగ్ లో పాల్గొనడమా చెయ్యాలని చెప్పాడు. దాంతో పని చేస్తూ రేసింగ్ లో పాల్గొన్నాను. అలాంటి అమ్మ నాన్న ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. అజిత్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1990 లో 'ఎన్ వీడు ఎన్ కనవార్' అనే చిత్రంలో ఒక చిన్న రోల్ తో అజిత్ కెరీర్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత 1995 లో వచ్చిన 'ఆశై' మూవీతో సోలోహీరోగా హిట్ ని అందుకొని ఇప్పటి వరకు 63 చిత్రాల దాకా చేసాడు. తన కొత్త చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.