English | Telugu

అప్పుడు మంచు విష్ణు.. ఇప్పుడు అక్కినేని అఖిల్!

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'ఏజెంట్'పై అక్కినేని అఖిల్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నమ్మకంతో తన మేకోవర్ ని మార్చుకొని ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ప్రమోషన్స్ లోనూ స్టంట్స్ చేసి కష్టపడుతున్నాడు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్స్ సాయంతో దిగుతూ.. ఏజెంట్ ట్రైలర్ ను ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక వైల్డ్ పోస్టర్ ను అఖిల్ లాంచ్ చేశాడు. సినిమా కోసం అఖిల్ అంత రిస్క్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో గతంలో మంచు విష్ణు సైతం ఇలాంటి రిస్క్ చేశాడని గుర్తు చేసుకుంటున్నారు.

12 ఏళ్ళ క్రితం మంచు విష్ణు 'వస్తాడు నా రాజు'(2011) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. అప్పుడు ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న విష్ణు.. సినిమాలో రియల్ స్టంట్స్ చేయడమే కాకుండా ప్రమోషన్స్ లోనూ అదే దూకుడు చూపించాడు. హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర రోప్స్ సాయంతో చాలా ఎత్తు నుంచి దిగుతూ.. 'వస్తాడు నా రాజు' పోస్టర్ ను లాంచ్ చేశాడు. అప్పట్లో విష్ణు చేసిన స్టంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా మాత్రం పరాజయం పాలైంది. మరి ఇప్పుడు విష్ణు తరహాలోనే ఎత్తు నుంచి దిగుతూ పోస్టర్ ను లాంచ్ చేసిన అఖిల్.. ఆ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి.