English | Telugu
'బింబిసార' దర్శకుడితో మెగాస్టార్ సోషియో ఫాంటసీ ఫిల్మ్!
Updated : Apr 17, 2023
ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ 'వేదాళం'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. మరోవైపు 'భోళా శంకర్' తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఆయన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషించిన 'బింబిసార' సినిమాతో వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యాడు. సోషియో ఫాంటసీ ఫిల్మ్ గా రూపొందిన 'బింబిసార' గతేడాది ఆగస్టు లో విడుదలై ఘన విజయం సాధించింది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకొని సక్సెస్ కొట్టాడు వశిష్ట. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తోనే ఆయన 'బింబిసార-2' తీస్తాడు అనుకుంటే ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. మధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలవడంతో ఆయనతో వశిష్ట రెండో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి కోసం వశిష్ట అదిరిపోయే సోషియో ఫాంటసీ కథని సిద్ధం చేశాడట. కథ నచ్చడంతో మెగాస్టార్ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పినట్లు వినికిడి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. మూడు దశాబ్దాల క్రితం వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలు 'యముడికి మొగుడు', 'జగదేకవీరుడు అతిలోకసుందరి'తో మెగాస్టార్ ఎంతటి విజయాల్ని అందుకున్నారో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి.