.jpg)
నేస్తమా!
నీవు లేకపోతే నేను లేనని
ప్రత్యేకించి చెప్పాలా?
నా చిన్ని కాగితప్పడవలు నడిపి
నాకు నేనే గొప్పగా కేరింతలు కొట్టేలా చేసావ్..
ఇంటికొచ్చే బంధువుల నడక శబ్దాన్ని
గుమ్మంలోకి అడుగుపెట్టే ముందే గుర్తించినట్టుగా
నీ రాకను గుర్తించి సంబరంగా పరిగెత్తుకొచ్చేదాన్ని..
పెరటి మెుక్క మౌనంగా రాలుస్తున్న ఆనందభాష్పాలకు
వంతపాడుతున్నట్టుగా కేరింతలు కొడుతూ నీలో కలిసిపోయేదాన్ని..
ఒంటరినై దిగాలుగా ఆలోచనల్లో మునిగినపుడు
నేనున్నానంటూ తల్లిలా దరికి చేరి
వెచ్చగా నా బుగ్గలు స్పృశిస్తావు ..
నన్ను తడిపి నా మనసునూ శుద్ధి చేస్తావు..
కరువుతో అన్నదాత కన్నీరొలికిస్తుంటే
కళ్ళు కడిగి ముత్యాల సిరులు కురిపిస్తావు..
ప్రాణవాయువునిచ్చే పచ్చదనానికి పురుడు పోసి
మాకు జీవనాధారం అయ్యావు..
నేస్తమా! ఏమిచ్చి నీ బుుణం తీర్చుకోనూ..
మళ్ళీ పసిదాన్నై నీతో ఆడుకోవటం తప్ప!!
(చిన్ననాటి నేస్తం వానకు అంకితం)
(1).jpg)
...సరిత భూపతి



