Facebook Twitter
తెలుసునా మిత్రమా!!

తెలుసునా మిత్రమా 

మనమెందుకు ఒంటరైనామో 

నడకకు జతలేక 

పయనానికి దిక్కులేక!

కలల గమ్యం వేటలో 

ఆశల రహదారిలో 

సొగసైన సవారీతో  

పరిగెత్తించిన కోర్కెల గుర్రాలు

హఠాత్తుగా అపరిచితులైనట్టు 

తమదారి తాము చూచుకొని 

ఒక్కటొక్కటిగా అదృశ్యమై 

ఏ దూరాలకు పారిపోయాయో 

ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా? 

ఉచ్ఛ్వాస నిశ్వాసములకే ఉనికై 

ఊపిరికే ఊపిరై ప్రాణములో ప్రాణమై 

యదపొదరింట్లో కొలువై 

అతిప్రీతిపాత్రమైన ప్రియకామన 

ఉసురుదీసి జీవచ్ఛవాన్నిజేసి 

ఎడంగా ఎందుకు వెళ్లిపోయిందో

ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?

జీవితసాఫల్యతీరం దిశకు

భద్రంగా పయనించు జీవననావ 

నడిసంద్రపు సంధ్యలో 

తొట్రుపాటుతో ముందుకు సాగనంటూ

గమనమెటో తేల్చుకొమ్మంటూ 

బ్రతుకునెందుకు 

డోలాయమానస్థితికి లంగరేసిందో

ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?

అంతటికీ కారణం 

మస్తిష్కపు ఆలోచనా తరంగాల్లో

అమాసనిశానిరాశల వత్తిళ్ల ప్రభావమనీ 

ప్రయత్నపు పోరాట పున్నమి వెలుగుల్ని

అలుపెరగక అధైర్యపడక ఆహ్వానిస్తే  

వెన్నెల వెలుగుల ధైర్యమావహించి 

కోరుకున్న ఆశల గమ్యానికి 

నడకకు దశ దిశ తోడు దక్కేనని

ఇప్పటికైనా ఆలోచించావా??


— రవి కిషొర్ పెంట్రాల