Facebook Twitter
పిడికిలి

పిడికిలి

 

 

 

పుట్టినపుడు నా లేత పిడికిళ్ళలో
పొదుపుకున్నది అక్షరాన్నే!

చిన్నప్పుడది.. పాలచెక్కిళ్ళతో
బోసినవ్వుల వాగ్దానంలా
ఒద్దికగా  ముడుచుకుని ఉండేది
కొన్నాళ్ళకి.. కళ్ళు తెరచిన పుస్తకంలా
నిటారుగా నిలబడింది
ఆకాశంలోకి సూటిగా ఎగిసిన పతంగమైంది
నిరంతరం ఓ వెదుకు దీపమైంది.
ఆ పై సాధికార స్వరంలా ఎగిసింది
స్వీయ అస్థిత్వ ప్రకటనంతో
స్వయంప్రకాశ నక్షత్రమైంది.
మానవత్వాన్ని నింపుకొన్న
అమ్మతనమైంది
ముమ్మాటికి వెన్నముకలా
నిలబెట్టిన వజ్రాయుధమైంది
అప్పుడు...ఇప్పుడు...ఎప్పుడూ...
ఆ అక్షరం పిడికిట్లోనే ... పాపాయిలా నేను!


- సి. భవానీ దేవి.