Facebook Twitter
ఊడలు

ఊడలు

రచన - డాక్టర్.సి. భవానీదేవి


ఇప్పుడు బాల్యం మనసునిండా
అమ్మ నాన్నల ఆరాటాల పోగే !
ఒంటరిగా పోరాడుతూ
యుద్ధ మైదానంలో మోహరించిందే అదే !
మానవ సాధన
సమష్టి జీవన సౌందర్యమైతే
ఒకరికొకరుగా శిఖరాలకు నడవాలి కదా !
మరి ఈ పసిచూపుల నిండా
పరీక్షలు, ర్యాంకుల ఊడలు !
ఇల్లు, తరగతి, క్రీడామైదానం
గ్రంథాలయం, రోడ్డు
ఎక్కడయినా ఒంటరి యాతనే !

సమూహ ఉత్సాహాన్ని సమాధి చేసే
తోటి వారితో పోటీ భయంతో
ప్రతిరోజూ ఓ పరుగు పందెమే !

మనిషికీ వ్యవస్థకూ
అగాధమంత అంతరం
ఎందరి సాధనో ఓ విజయమైనప్పుడు
ఒంటరి పోరాటంలో
మాయమయ్యేది ఆ బాల్యమే !