Facebook Twitter
మేడే నాటి ముభారకులు

మేడే నాటి ముభారకులు



నాగలి పట్టే నాగన్న రెక్కలు తెగిన రైతన్న
సమ్మెట పట్టే సూరన్న సన్నాయి మేళం సంగన్న
మీసం మెలిలో  మగ్గిపోతున్న మంగలి సత్తెన్న
మురికి బట్టలు చుట్టి మూటను కట్టే చాకలి చిమ్మన్న

రెక్కలు ముక్కలు చేసి రంగుల చీరలు నేసే దేవాంగి దానయ్య
కండలు కరిగించే కంసాలి కామయ్య
కంపును ఇంపుగా మోసే పాకీ పాపమ్మ
కావడి కుండలు మోసే కుమ్మరి కూనయ్య

బుగ్గిలో మగ్గి బుట్టలు తట్టలు అల్లే మేదరి ముసలయ్య
బుగ్గలు బుగ్గి అయ్యేదాకా శంకం ఊదే జంగాల సాంబయ్య
ఆకాశం నుండి అమృతం దించి ఆగమైపొతున్న గౌన్ల గురయ్య
అప్పడాలు అద్ది అంగట్లో అమ్మే కోమటోల కనకమ్మ

డప్పులుకొట్టి  దండోరా  వేసే మాలోల ముత్తయ్య
చెమటలు పట్టి చెప్పులు కుట్టే మాదిగ మల్లయ్య
చెత్తను చెరిపేసి చిత్రం గీసేసిన శుబ్బరాలు చుక్కమ్మ 
నెత్తుటి చుక్కలు చిమ్మి బండలు పిండి చేసే పటానయ్య

మండే ఎండలతో ఎండే గుండెలతో
కాయా కష్టంతో వచ్చిన నష్టంతో కనుమరుగౌతున్న
కార్మిక  కర్తలకు కాలే కడుపులకు కర్షక జీవులకు
మేడే  నాటి ముభారకులు


                                                                మీగడ త్రినాధ రావు