Facebook Twitter
మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ

మనసా! తెలుసా?


- వడ్డెపల్లి కృష్ణ

 

మనిషి పుట్టిన నాడు తిరిగి గిట్టిన నాడు

ఏడుపే ఎదురౌను మనసా!

మధ్యలో కలిగేటి భోగభాగ్యలన్ని

మిధ్యమే మరి నీకు తెలుసా?

 

పైస గలవాడేను నిలబడేందుకు వీలు

'ప్రజాస్వామ్యం' ఇదే మనసా!

లక్షలను భక్షించు ఈ ఎలక్షన్లన్ని

లాభ రహితమ్మేను తెలుసా?

 

ఉన్నవానికె విలువ ఉన్న దేశమ్ములో

ఉండలేడిక పేద మనసా!

'గరీబీ హటావ'ని గర్జించి నంతనే

గట్టెక్కలేమనియు తెలుసా?

 

దినదినం ఈనాడు విద్యార్ధి బ్రతుకంత

'డిగ్రీ' ల మయమాయె మనసా!

పై చదువు లెన్నున్న 'పైరవీ' లేనిదే

ఫలితమ్ము శూన్యమ్ము తెలుసా?

 

"హాప్పీ" ల పేరుతో కుప్పిగంతులు వేసి

ఇది నాగరికతనిరి మనసా!

జుట్టు నడవిగ పెంచునట్టి నాగరికతయు

ఆది మానవునిదే తెలుసా?

 

  'స్ట్రీకింగ్' పేరుతో నగ్న నాట్యం నేడు

సిసలైన 'ఫ్యాషనట' మనసా!

మెల్లమెల్లగ మనిషి నవనాగరికతనుచు

వెళ్ళేది వెనుకకే తెలుసా?