Facebook Twitter
మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల్

మెరీనాబీచ్


- డాక్టర్ మణిగోపాల్

 

కవిత్వం లేని ఊరు

అక్షరాలు వలసపోతాయి

కలని చిత్రించే కలాలు ఇంకిపోతాయి

 

కవిత్వం లేని ఊళ్ళో

అమ్మకూడా పదినెలలు నిన్ను మోసిన కూలీయే!

అక్కడ 'రక్తసంబంధం' సినిమా ఆడదు

పువ్వులు కొమ్మలకే పూస్తాయి

పెదాల మీద కాదు

చందమామ నింగిలో ఉంటుంది 

అమ్మాయి మోములో కాదు

పక్షులు కేవలం

చెట్లని కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే!

 

కవిత్వం లేని ఊళ్ళో

రెప్పల్లోంచి ఉబుకుతున్న చూపులకి

ఇంద్రధనుస్సొక రంగుల మరక!

వాన పడినా ఈ నేలకి

కాగితం పడవలు పుట్టవు

ఆఫీసుకెళ్ళే సమయంలో

చినుకు వెంట చినుకు మహా చిరాకు!

కోకిల మాత్రం ఏం చేస్తుంది?

అది కూడా కాపీ ట్యూనే అందుకొంటుంది

 

కంటిపాపని కలల ఊయల్లో వేస్తేనే కదా...

కవిత్వానికి బాలసారె!

నిత్యం కరెన్సీని లెక్కించే వేళ్ళకి

అక్షరాల స్పర్శేం తెలుస్తుంది?

అసలు కవిత్వమే లేని ఊరు

ఒక ప్రవహించని సెలయేరు

ఎప్పుడైనా గుండెలోకి తొంగిచూసుకుంటే కదా....

ఆ పొడి కళ్ళకి కలల తడి అంటేది!

 

ఉగాదుల్లేని కాలండరుకు

అంకెల గారడీ తప్ప అక్షరాల మహిమేం తెలుసు?

ఉద్యమల్లేక ఉసూరనే ఊరు

ముప్పిరిగోనే నినాదాలేం చేస్తుంది?

 

కవిత్వం లేని ఊరు

పసిపాపలు లేని లోగిలి

కవిత్వం లేని ఊరు

పసుపు రాయని ఇంటి గడప

 

అందుకే.....

కవిత్వాన్ని గొంతెత్తి పిలువ్!

కురుల్ని నిచ్చెనలా చేసుకుని

ఒక్కో పువ్వూ అమ్మాయి సిగలోకి చేరుతుంటే

కవిత్వం తన్నుకురాదూ?

 

పత్రిక తిరగేస్కుంటే

ఓ మూల రేకులు విప్పుకుని

అక్షరాల పుప్పొడితో గుబాళిస్తున్న

కవిత్వమొకటి తొంగిచూస్తుంటుంది

ఒకే ఒక్క నిమిషం

నీ పెదాల మీద

ఆ పంకుల్ని కదలాడనీ

ప్రత్యక్షరాన్నీ తనివితీరా ఉచ్చరించు

 

నువ్వెక్కడో జారవిడుచుకు

ఓ జ్ఞాపకం ఎదురవట్లేదూ

మరిచిపోయిన చిరునవ్వులు

మళ్ళీ నిన్ను పలకరించట్లేదూ?

 

రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా

గాయపడ్డ మనసుకి మందు రాస్తున్నట్టుగా లేదూ?

కవిత్వం ఎక్కడో లేదు....

ప్రేమించే గుండెలో ఉంది

ఎన్ని యాతనలు పడ్డా ఫలించని ప్రేమలో ఉంది

మిత్రునికి వీడ్కోలు పలుకుతూ

వెనుదిరిగిన నీ పాదాల్లో ఉంది

 

పద....

ఈ ఊరిని కవిత్వంగా మార్చేద్దాం

ఈ దారి పొడవునా మనం

అక్షర పతాకల్ని ఎగురవేస్తూ నడుద్దాం!