
1992లో బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత మైనారిటీవాదం అనే పదం స్థిరపడింది. అయితే.. అంతకు ముందే 1991లో ఖాదర్ మొహియుద్దీన్ రాసిన పుట్టుమచ్చ కవిత మైనారిటీల దృష్టి కోణాన్ని నమోదు చేసింది. ముస్లింలు అనుభవిస్తున్న ప్రత్యేక వివక్షను ఎత్తిచూపింది. తెలుగు సాహిత్య విమర్శలో భాగంగానే ఉమర్ అలీషా, మహమ్మద్ ఖాసిం, షంషుద్దీన్ విమర్శనాత్మక రచనలు చేశారు. ఆ తర్వాత అబ్దుల్ సలామ్, ఇస్మాయిల్, డియస్ బషీర్, డాక్టర్ రుక్నుద్దీన్, సుభాని, ప్రొఫెసర్ షేక్ మస్తాన్, అబ్దుల్ రజా హుస్సేన్, అఫ్సర్, జావీద్ హుస్సేన్ వంటివారు విమర్శనా వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యంలోని సంపూర్ణత్వంలో భాగంగానే వారి రచనలు సాగాయి. ఆ తర్వాత మైనారిటీ కాల్పనిక సాహిత్యం, దానికి సరిజోడుగా విమర్శ ప్రారంభమయ్యాయి.
స్కైబాబ సంపాదకుడిగా వెలువడిన ‘జల్‌జలా’ కవితా సంకలనానికి ఎంటి ఖాన్, బాలగోపాల్, అఫ్సర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన వ్యాసాల్లో మైనారిటీ సాహిత్య విమర్శకు ఉపకరించే సిద్ధాంత ప్రాతిపదిక కనిపిస్తుంది. ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక ముల్కి జిలుకర శ్రీనివాస్ రాసిన మైనారిటీ సాహిత్య డిస్‌కోర్స్ అనే వ్యాసంలో మైనారిటీ సాహిత్య మూలాలను చర్చించడమే కాకుండా మైనారిటీ సాహిత్య విమర్శ సాగాల్సిన తీరును చూపించాడు. రహమతుల్లా వ్యాసం తెలుగు కథలో ముస్లిం జీవితాలు భాష అనే వ్యాసంలో సాహిత్య విమర్శకు సంబంధించిన స్పష్టమైన రూపం కనిపిస్తుంది. కరీముల్లా ముస్లిం సాహిత్యకారుల సామాజిక బాధ్యత అనే వ్యాసంలో విమర్శకు కావాల్సిన వాతావరణాన్ని కొంత వివరించాడు.
మైనారిటీ సిద్ధాంతం, మైనారిటీ సాహిత్య విమర్శ స్థిరపడడానికి మైనారిటీయేతర సాహిత్యకారుల కృషి ఎక్కువగా ఉంది. వారిలో అంబటి సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బాలగోపాల్, జిలుకర శ్రీనివాస్, బిఎస్ రాములు, కాసుల ప్రతాపరెడ్డి ముఖ్యమైనవాళ్లు. ముస్లింవాదం ముందుకు వచ్చిన తర్వాత భాష ఒక కొత్త రూపాన్ని తీసుకుంది. విమర్శకుడిగా స్కైబాబ జీవన వాస్తవికత దిశగా ఆలోచన చేస్తూ మైనారిటీ సాహిత్యాన్ని విశ్లేషించారు. మైనారిటీ సాహిత్యాన్ని, ఆ సాహిత్య విమర్శనా కోణాన్ని హేతుబద్దంగా వివరించాడు.
తెలుగు ముస్లిం స్త్రీల కవిత్వం అనే వ్యాసంలలో షాజహానా ప్రతిపాదించిన అంశాలు మైనారిటీవాద విమర్శలో అత్యంత ప్రధానమైనవి. స్త్రీల కవిత్వం విప్లవదళిత మైనారిటీ ఉద్యమాలు అనే వ్యాసంలో ఎండ్లూరి సుధాకర్ మైనారిటీ స్త్రీల కవిత్వాన్ని సమర్థంగా అంచనా వేశారు. డాక్టర్ షమీ ఉల్లా తెలుగులో ముస్లిం సాహిత్యం మీద పరిశోధన చేయడమే కాకుండా పలు వ్యాసాలు రాశారు.. పెన్నా శివరామకృష్ణ రాసిన భూకంపం సృష్టించిన ముస్లింవాద కవిత్వం అనే వ్యాసం మైనారిటీ సాహిత్య విమర్శలో ఓ మైలురాయి. అలావా కవితా సంకలనానికి రాసిన ముందుమాటలో ఖాదర్ మొహియుద్దీన్ సూఫీ తాత్వికతే ముస్లిం తాత్వికత కావాలని అన్నారు. దాన్ని స్కైబాబ మరింతగా విస్తరించారు.
ముస్లిం కవిత్వ అభివ్యక్తి రీతులపై, తెలుగు కవిత్వానికి ముస్లిం కవిత్వం అందించిన కొత్త చేర్పుపై విశేషంగా చర్చ జరిగింది. ఖాజా ముస్లిం కవిత్వ సౌందర్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇది సాధారణీకరణ విషయంలోనే కాకుండా ముస్లిం కవిత్వ ప్రత్యేకత విషయంలో కూడా కళా సౌందర్యాన్ని నిర్వచించడానికి సరిపోదు. అయితే, ముస్లిం కవిత్వ సౌందరర్యం గురించి, నూత్న అభివ్యక్తి గురించి, తెలుగు సాహిత్యంలో ముస్లిం కవిత్వం తెచ్చిన మార్పు గురించి హర్యాలి, గవాయ అనే సంకలనాల్లోని వ్యాసాల్లో కొందరు రచయితలు విశ్లేషించారు. ఈశ్వరానంద అనే రచయిత స్కైబాబ రాసిన సుల్తానా కథపై దాడి చేస్తూ జల్‌జలా కవిత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ ముస్లిం కవిత్త్వ రీతులను విశ్లేషించడానికి కాసుల ప్రతాపరెడ్డి ప్రయత్నం చేశారు. వర్తమాన కవిత్వం చాలాసార్లు, మరీ ముఖ్యంగా, అణచివేతకు, వివక్షకు గురవుతున్నప్పుడు ఆగ్రహంగానే వెలువడుతుంది. ఆ ఆగ్రహం నుంచి అకవిత్వం కవిత్వంగా వెలువడుతుంది. ఇది గుణమే గాని దోషం కాదు. సందర్భాన్ని బట్టి కూడా భావవ్యక్తీకరణ ఉంటుంది. ఈ సందర్భం నుంచి విడదీసి కవిత్వాన్ని చూడడం సరి కాదు. సందర్భాన్ని కవిత్వం నుంచి విడదీసి సాధారరణీకరించాలనుకుంటే పెద్ద ముప్పే వాటిల్లుతుంది అని ఆయన అన్నారు.
ముస్లిం కవిత్వ అభివ్యక్తి, శైలీ రూపాల గురించి గవాయలో కాస్త ఎక్కువ చర్చ జరిగింది. ముస్లిం కవిత్వంలో తెలుగు, ఉర్దూ కలగలసిన భాషను వాడడం వ్యక్తీకరణలో కొత్త మార్పునకు దోహదం చేసింది. ముస్లిం కవులు వాడుతున్న మత ప్రతీకలను చూడాల్సిన తీరుపై చేసిన విశ్లేషణ కొత్త చూపును అందిస్తుంది. స్కైబాబ కవిత్వ పరిభాషను వివరిస్తూ ` హిందూ మతప్రతీకలను కాకుండా ముస్లిం మత ప్రతీకలను స్కై వాడుకున్నాడు. హిందూ మత ఛాందసవాదులను ఎదుర్కోవడానికి స్కైకి ఇస్లాం మత ప్రతీకలు బాగా ఉపకరించాయి. యుద్ధం చేయడానికి కొత్త పనిముట్లనున స్కైబాబ తయారు చేసుకున్నాడు. దళిత కవిత్వం ఆధిపత్యాలపై పోరుకు క్రైస్తవ మత ప్రతీకలను బలంగా వాడుకోవడం ఇటువంటిదే’ అని అంటూ కొత్త అర్థంలో శ్రీశ్రీ హిందూ మత ప్రతీకలను వాడినప్పుడు అదే కొత్త అర్థంలో ఇస్లాం మత ప్రతీకలను వాడితే అభ్యంతరం ఎందుకుండాలని ప్రశ్నించారు.
ఉర్దూ, అరబీ, పారసీ పదాలను తెలుగు కవిత్వం అంతరాత్మతో అనుసంధానించి శస్త్ర చికిత్స జరిపి తొలగించడానికి వీల్లేని విధంగా ముస్లిం తత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు. వస్తువుకీ, రూపానికీ మధ్య అభేదాన్ని సాధించడం వీళ్ల ప్రత్యేకత. అనుభవించిన బాధకీ, అభివ్యక్తం చేసిన భాషకీ మధ్య అంతరాన్ని అణుమాత్రం అవకాశం లేకుండా చేయడం వీళ్ల విశిష్టత అని ముస్లిం కవులను ఖాదర్ మొహియుద్దీన్ అలావాకు రాసిన ముందు మాటలో అన్నారు. ముస్లింల ప్రత్యేక సమస్యల నేపథ్యం నుంచి తెలుగు సాహిత్యంలో వేళ్లూనుకున్న ముస్లింవాదం ప్రతిఫలనంగా మైనారిటీ సాహిత్య విమర్శ స్థిరపడింది.
-కాసుల ప్రతాప్ రెడ్డి



