
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది, కొక్కొండ వెంకటరత్నం రచనపై కందుకూరి విగ్రహతంత్ర విమర్శనము అనే పేరుతో విమర్శ రాశాడు. ఇందులో భాషాపరమైన దోషాలను ఎత్తిచూపడమే ఎక్కువగా ఉంది. సంఘ సంస్కరణ దృష్టితో చేసిన విమర్శ ఉంది. కావ్యానికి సంబంధించిన బాహ్య అంశాలనే ప్రధానంగా విశ్లేషించారాయన. ఈ రకంగా చూస్తే కందుకూరి పాశ్చాత్య విమర్శనా లక్షణాలను ఆకళింపు చేసుకున్నప్పటికీ తెలుగులో ఆధునిక విమర్శ మార్గాన్ని ప్రామాణిక రీతిలో నిర్వచించలేకపోయారు. అభాగ్యోపాఖ్యానము , ఆంధ్ర కవుల చరిత్ర అనే రచనలు కూడా చేశారు.
కందుకూరి వీరేశలింగం కన్నా ముందు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద పనిచేసిన కావలి వేకంట రామస్వామి అనే పండితుడు 1829లో ఇంగ్లీషులో దక్కను కవుల చరిత్ర ను Biographical sketches of Deccan poets గా రచించాడు. తెలుగు భాషాసాహిత్యాలను సిపీ బ్రౌన్ క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. ఆయన వేమన పద్యాలను తెలుగులోనే కాకుండా ఇంగ్లీషులో కూడా అందించారు. శైవకావ్యాల్లోని శృంగార వర్ణనల్లో సభ్యత, సంస్కారం కనిపిస్తాయని, శైవేతర సాహిత్యంలో శృంగార వర్ణనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన విశ్లేషించాడు. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 1896లో వివేక చంద్రికా విమర్శనము అనే గ్రంథాన్ని వెలువరించారు. ఆధునిక ప్రక్రియ అయిన నవలపై వచ్చిన తొలి విమర్శగా దీన్ని చెప్పవచ్చు. గురజాడ అప్పారావు ఆధునిక ఆంధ్ర వచన రచన అనే ఇంగ్లీసు వ్యాసంలో దుగ్గిరాల రాఘవ చంద్రయ్య రాసిన విజయనగర సామ్రాజ్యాలు అనే నవలను పరిశీలించారు. తెలుగు సాహిత్య విమర్శలో ఎన్నదగినవారు కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన కవిత్వతత్త్వ విచారము తెలుగు సాహిత్య విమర్శలో ఆధునికతను సమర్థంగా ప్రవేశపెట్టిన గ్రంథంగా ప్రసిద్ధి పొందింది.
ఈ గ్రంథంలో ఆయన సాంప్రదాయిక విమర్శలో లేని imaginationని ప్రతిపాదించాడు. రచనకు అది ముఖ్యమని చెప్పారు. సాహిత్యంపై సామాజిక శక్తుల ప్రభావం గురించి తొలిసారి ప్రస్తావించినవాడు కట్టమంచి అని సివీ సుబ్బారావు తన విభాత సంధ్యలు అనే పుస్తకంలో రాశారు. కట్టమంచి సంప్రదాయ భావాలను ప్రశ్నించాడు.
అక్కిరాజు ఉమాకాంతం 1928లో నేటి కాలపు కవిత్వం అనే గ్రంథంలో భావకవిత్వంపై విరుచుకుపడ్డారు. కాలపరిమితిని స్వాగతించకపోవడం అనే లోపం ఈ విమర్శలో ఉంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సారస్వతోపన్యాసములు , నాటకోపన్యాసములు , ‘వేమన’ వంటి విమర్శనా గ్రంథాలను వెలువరించారు. ఆయన ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాల అవగాహనతో, అనుశీలనతో సౌందర్యాన్వేషణ చేశారు. విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ దృష్టితో, ప్రాచీన అలంకారిక సిద్ధాంతాలతో విమర్శ చేశారు. నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి, శాకుంతలము యొక్క అభిజ్ఞానత, అల్లసానివారి అల్లిక జిగిబిగి వంటివాటిని ఆయన విమర్శనారీతికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
కట్టమంచి రామలింగారెడ్డి సూచనప్రాయంగా వెల్లడించిన వాస్తవికతా ధోరణి తర్వాతి కాలంలో హేతువాదంగా, గతితార్కిక భౌతికవాదంగా, మానవతా వాదంగా విస్తరించింది. ఇది మార్క్సిస్టు విమర్శకు దారి తీసింది. మార్క్సిస్టు విమర్శ తర్వాతి కాలంలో అభ్యుదయ సాహిత్య విమర్శగా, విప్లవ సాహిత్య విమర్శగా విస్తరించింది.
మద్దుకూరి చంద్రశేఖర రావు, జీవి కృష్ణారావు, తాపీ ధర్మారావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, తుమ్మల వెంకట్రామయ్య, కేవిఆర్, రారాగా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి మార్క్సిస్టు విమర్శ చేసినవారిలో ముఖ్యులు. జీవీ కృష్ణారావు 1938లో తన ‘కావ్య జగత్తు’ ద్వారా మార్క్సిస్టు విమర్శకు పునాదులు వేశాడు.
ప్రముఖ కవి శ్రీశ్రీ కూడా విమర్శ రాశాడు. ఆయన తన విమర్శలో ప్రధానంగా లక్ష్య ప్రకటనలు చేశారు, వర్గ దృక్పథాన్ని నొక్కి చెప్పారు, సోషలిజానికీ సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిపాదించారు. అయితే.. ఆయన మార్క్సిస్టు విమర్శకుల్లో కనిపించే యాంత్రికతకు దూరంగా ఉన్నారు. కాగా శ్రీశ్రీ విమర్శలో మార్క్సిస్టు పద్ధతి ఎంతవరకు ఉందనేది సందేహమేనని చేరాలాంటివాళ్లు అభిప్రాయపడ్డారు. గురజాడ, వేమనల మీద ఆయన వ్యాసాలు రాశారు. గురజాడ ముత్యాలసరాల మీద రాశారు.
ఆ తర్వాత మార్క్సిస్టు విమర్శకుడిగా కొడవటిగంటి కుటుంబరావు ముందడుగు వేశారు. పారిభాషిక పదాలు, ఉటంకింపులు లేకుండా ఆయన ప్రతి విషయాన్ని తన అవగాహనలోంచి అర్థం చేసుకుని అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. విమర్శకుడిగా కొడవటిగంటికుటుంబరావుకి ఒక స్వతంత్రమైన తాత్విక వ్యక్తిత్వం ఉందని బాలగోపాల్ అభిప్రాయపడ్డారు. శాస్త్రీయమైన ఆలోచనా విధానం, మార్క్సిస్టు సామాజిక దృక్పథం, మానవతావాదం ఆయన వ్యక్తిత్వంలో భాగం. ఇవన్నీ కలిసి అభ్యుదయ దృక్పథం ఏర్పడుతుంది. ఈ అభ్యుదయ దృక్పథం కొడవటిగంటి కుటుంబరావుకు ఉంది.
కేవీఆర్ మార్క్సిస్టు విమర్శకుల్లో ఎన్నదగినవాడు. గురజాడపై రాసిన మహోదయం గ్రంథాన్ని మార్క్సిస్టు విమర్శనా సూత్రాలను అన్వయిస్తూ రాశారు. ఆరుద్రపై ఆయన చేసిన విమర్శ అత్యంత ప్రధానమైంది. శ్రీశ్రీ కంటే ఎక్కువగా కవిత్వ భాషను విప్లవీకరించిన ఘనత ఆరుద్రది అని ప్రకటించారు. కేవీఆర్ తన విమర్శలో చారిత్రక దృష్టిని ప్రదర్శించారు. రా.రా.గా పిలుచుకునే రాచమల్లు రామచంద్రారెడ్డి విమర్శను వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయికి ఎదిగించారు. త్రిపురనేని మధుసూదనరావు సాహిత్యం వరకే పరిమితం కాలేదు. సాహిత్యం, రాజకీయ, తాత్విక రంగాలకు సంబంధించిన అంశాల గురించి రాశారు. ఆయన కవిత్వం చైతన్యం అనే విమర్శనా సంపుటిని వెలువరించారు. సాహిత్య చరిత్ర వ్యక్తుల పేర్లతోనో, రాజవంశాల పేరుతోనో ఉండడాన్ని ఆయన వ్యతిరేకించారు. కొత్తగా ఆయన యుగవిభజన చేశాడు.
పౌరహక్కుల కోసం, ఆ తర్వాత మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన కె. బాలగోపాల్ చేసిన సాహిత్య విమర్శ తెలుగులో అత్యంత ప్రధానమైంది. రూపం సారం అనే పేరుతో ఆయన సాహిత్య విమర్శ గ్రంథం వెలువడింది. రాజకీయ, ఆర్థికాంశాల సమన్వయంలో ఆయన సాహిత్య విమర్శ చేశారు. ప్రముఖ రచయిత రావిశాస్త్రి నవలలపై రాస్తూ లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది వాస్తవిక దృక్పథం అవుతుందే కానీ విప్లవ దృక్పథం కాదని అభిప్రాయపడ్డారు. విమర్శ నిర్దిష్టంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. మార్క్సిజం మీద ఆయన పరోక్షంగా విమర్శ పెట్టాడు.
తెలుగు మార్క్సిస్టు విమర్శకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించడానికి సీవి సుబ్బారావు ప్రయత్నించారు. ఆయన తాను సంపాదకత్వం వహించిన విభాత సంధ్యలు పుస్తకంలో తెలుగు మార్క్సిస్టు విమర్శనా ధోరణిలో పరిమితులు ఉన్నాయని గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రయత్నించారు.
మార్క్సిస్టు విమర్శలో లేని Text Centred విమర్శను చేరాగా పిలిచే చేకూరి రామారావు ప్రవేశపెట్టారు. ఆయన కేవలం మార్క్సిజాన్ని మాత్రమే కాకుండా భాషాశాస్త్రాన్ని, ఇతర శాస్త్రాలను తన సాహిత్య విమర్శకు వాడుకున్నాడు. రాజకీయ సిద్ధాంతాల భారం లేకుండా తెలుగు సాహిత్య విమర్శ చేశారు చేరా. భాషా శాస్త్రం ఆయనకు అదనపు శక్తిని ఇచ్చింది.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శ శిల్పం అనే పుస్తకాలను వెలువరించారు. సాహిత్య సిద్ధాంత నేపథ్యాన్ని చెబుతూనే అన్వయానికి ఆయన తన విమర్శలో ప్రాధాన్యం ఇచ్చారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శను నిర్దిష్టమైన దేశీయ సాహిత్య సంబంధంలోంచి కేకెఆర్‌గా పిలుచుకునే కె. రంగనాథాచార్యులు పరిశీలించడానికి ప్రయత్నించారు. కేతవరపు రామకోటి శాస్త్రి సంప్రదాయ సాహిత్యం నుంచి వచ్చి, మార్క్సిస్టు సాహిత్య విమర్శనా ధోరణిని అందిపుచ్చుకున్నారు.
మొత్తంగా అభ్యుదయ సాహిత్య విమర్శగా ప్రారంభమైన మార్క్సిస్టు విమర్శ విప్లవ సాహిత్య విమర్శగా ఎదుగుతూ వచ్చింది. అయితే, ప్రజల చరిత్రనే నిజమైన చరిత్ర అని పదే పదే చెబుతూ వచ్చిన అభ్యుదయ, విప్లవ సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు చేయని పని సురవరం ప్రతాపరెడ్డి చేశారు. తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథంలో ప్రజల చరిత్రకు పట్టం కట్టారు. ప్రజల వైపు నుంచి చరిత్రను రాశారు. ఇందులో భాగంగానే ఆయా యుగాల్లోని సాహిత్యాన్ని కూడా విశ్లేషించారు.
- కాసుల ప్రతాపరెడ్డి



