Facebook Twitter
దళిత సాహిత్య విమర్శ - స్థూల పరిచయం

1980 దశకంలో ఊపందుకున్న మరో అస్తిత్వ ఉద్యమం దళితవాదం. అంబేడ్కర్ సామాజిక విప్లవ దృక్పథం సైద్ధాంతిక భూమిక పునాదిగా ఈ ఉద్యమం తలెత్తింది. ఆత్మగౌరవాన్ని ప్రధానంగా దళిత స్పృహ కోరుకుంది. దళిత సాహిత్య విమర్శ సిద్ధాంత చర్చతో మొదలైంది. కులాన్ని పునాది అంశంగా స్వీకరించి చర్చోపచర్చలు జరిగాయి. దళిత తాత్వికత రూపుదిద్దుకునేందుకు ఈ చర్చలు ఉపయోగపడ్డాయి. విప్లవోద్యమాన్ని ప్రశ్నించడంతో దానికి పునాదులు పడ్డాయి. దళిత సాహిత్య విమర్శ - దృక్పథం, పరిణామం, ఒక పరిచయం  అనే వ్యాసంలో బిఎస్ రాములు దళిత విమర్శను నిర్వచించారు. విప్లవోద్యమంపై ప్రశ్నలు సంధిస్తూ బిఎస్ రాములు రాసిన  గతితర్క తత్వదర్శన భూమిక  పుస్తకం ప్రధానమైంది.

జి. లక్ష్మీనరసయ్య వంటి దళిత సాహిత్య విమర్శకులు  దేశీయ మార్క్సిజం  అనే ప్రతిపాదన చేశారు. ఇందులో భాగంగానే డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి  దళం, దళితం రెండూ కావాలని ప్రతిపాదించారు. ఉ. సాంబశివరావు, కేజీ సత్యమూర్తి అంబేడ్కరిజం, మార్క్సిజం సమన్వయంతో ఈ దేశీయ మార్క్సిజానికి రూపకల్పన చేశారు. ఈ ప్రతిపాదనను నావంటి వారుర కొందరు వ్యతిరేకించారు. బిఎస్ రాములు వీరన్న పార్టీపై చేసిన విమర్శలు దాన్ని సమర్థించేవిగా ఉన్నాయి. దళిత సాహిత్య తాత్వికతను నిర్దేశించడానికి ప్రయత్నించినవారిలో కత్తి పద్మారావు, కంచె ఐలయ్య ముఖ్యులు. 
కలేకూరి ప్రసాద్ రచించిన దళిత ఉద్యమం   దళిత సాహిత్యోద్యమం  అనే పుస్తకం స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం దళిత సామాజిక, ఆత్మగౌరవ పోరాటాలు ఎలా ముందుకు వచ్చాయో, వాటి ఫలితంగా దళిత సాహిత్యం ఎలా ఆవిర్భవించిందో వివరిస్తుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) రంగం మీదికి వచ్చిన తర్వాత గుణాత్మకమైన మార్పు సంభవించింది. దళిత సాంస్కృతిక అస్తిత్వానికి అది తాత్విక భూమికను అందించింది. 

దళిత సాహిత్యంపై జరిగిన వాదవివాదాలను డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ ఒక పుస్తకంగా తెచ్చారు. 1990 దశకంలో స్త్రీ, దళితవాదాలు సామాజిక, తాత్విక, సాహిత్య రంగాల్లో కొత్త ప్రశ్నలను సంధించాయని ఆయన అన్నారు. కొత్త వ్యక్తీకరణకు మార్గం వేశాయని గుర్తించారు. ఆర్ఎస్ సుదర్శనం, మో దళిత సాహిత్యాన్ని తప్పు పట్టారు. మో అనే వేగుంట మోహనప్రసాద్‌కు హెచ్చార్కె ధీటైన సమాధానం ఇచ్చారు. దళిత కవిత్వంలో బూతు పదాల వాడకంపై తీవ్రమైన చర్చ జరిగింది 
సాహిత్యాన్ని దళిత దృక్కోణం నుంచి చూసే పద్ధతికి బిఎస్ రాములు, కత్తి పద్మారావు వంటివారు ఉదాహరణగా నిలుస్తారు.  కన్యాశుల్కాన్ని ఇప్పుడెలా చూడాలి?’ అని బిఎస్ రాములు రాసిన వ్యాసం ద్వారా బ్రాహ్మణ  భావజాల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. కేశవరెడ్డి నవలలను విమర్శిస్తూ రంగనాయకమ్మ రాసిన వ్యాసానికి అసుర సమాధానం ఇచ్చారు. కత్తి పద్మారావు తులనాత్మక పరిశీలన ద్వారా నిమ్న వర్ణాల రచయితల సాహితీ విలువలను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ‘వేమన - జాషువా’, ‘జాషువా - గద్దర్’, ‘జాషువా - తాపీ ధర్మారావు’, ‘జాషువా - శ్రీశ్రీ’ అంటూ తులనాత్మక పరిశీలన చేశారు. దేశీయ మార్క్సిజాన్ని ప్రతిపాదించిన లక్ష్మీ నరసయ్య బీసీలను, మైనారిటీలను, ఎస్‌టిలను ఎస్‌సిల సరసన చేర్చి అమూర్త సాధారీకరణ చేశారు. 

సజనాత్మక సాహిత్యం మరింత ఫ్రాగ్మంటేషన్‌కు గురై బీసీలు, ఎస్‌టిలు, ముస్లింలు విడివిడిగా తమ ఐడెంటీలను ప్రకటించుకున్నారు. అంతేకాకుండా మాల, మాదిగలు కూడా విడివిడి ఐడెంటీలను ప్రకటించుకున్నారు. దీన్నే కాసుల ప్రతాపరెడ్డి 1997లో -  మేమే కవులు జీవిత మూలాల్లోకి వెళ్లారు. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ విధమైన పద్ధతి దాదాపుగా లేదు” అని అన్నారు. 

సాహిత్యానికి దళిత విమర్శ సూత్రాలను అన్వయించి వ్యాసాలు రాసిన, రాస్తున్నవారిలో శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు, జిలుకర శ్రీనివాస్‌లను ప్రధానంగా చెప్పుకోవాలి. నాగార్జున విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘వెంటాడే అవమానం’ కథపై సమర్పించిన వ్యాసం దళిత కథా విమర్శకు నమూనాలాంటిదని డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డారు. వేముల ఎల్లయ్య ‘కక్క’ నవలపై జిలుకర శ్రీనివాస్, బైరెడ్డి కష్ణారెడ్డి రాసిన వ్యాసాలు దళిత సాహిత్య విమర్శలో చెప్పుకోదగినవి. 

దళిత ఈస్తటిక్స్ గురించి శివసాగర్ వంటివాళ్లు మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చారు. అయితే, దీనికి సంబంధించి శిఖామణి తన ‘దళిత సాహిత్య తత్వం’ ద్వారా కాస్తా ఎక్కువ చర్చ చేశారు. అయితే, దళిత ఈస్తటిక్స్‌ను నిర్దిష్టంగా నిర్వచించడంలో వారెవరూ పెద్దగా ఫలితం సాధించలేదు. అందుకే దళిత ఈస్తటిక్స్‌ను నిర్వచించి, వివరించాల్సి ఉందని శ్రీరాములు ‘జాతర నవల - సమగ్ర పరిశీలన’ అనే పరిశోధనా గ్రంథానికి రాసిన ముందుమాటలో కాసుల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. అయితే, దళిత కవిత్వ శైలిని, అభివ్యక్తి నవ్యతను చాలా మందే గుర్తించి, వివరించారు. 

ఇకపోతే, దళిత సాహిత్యంలో మాలమాదిగ నిర్దిష్టలతో పాటు క్రైస్తవ, క్రైస్తవేతర నిర్దిష్టతలు చోటు చేసుకున్నాయి. కోస్తా దళిత కవులు క్రైస్తవ మత ప్రతీకలను విరివిగా వాడుకున్నారు. తెలంగాణ దళిత కవులు అందుకు భిన్నంగా కుల విశ్వాసాల నుంచి, తమ సామాజిక పరిస్థితుల నుంచి ముందుకు వచ్చినవాటిని వాడుకున్నారు. కవిత్వ భాషలో కూడా తేడా కనిపిస్తుంది. బ్రాహ్మణీయ భావజాలంపై పోరాటానికి కోస్తా దళిత కవులు క్రైస్తవ మతాన్ని, అందుకు సంబంధించిన ప్రతీకలను ఉన్నతీకరించారు. తెలంగాణ దళిత కవులు గ్రామ దేవతలను ఉన్నతీకరించారు. 

- కాసుల ప్రతాపరెడ్డి