Facebook Twitter
యధార్థ జీవితాలకు ప్రతీకలు

మహిళలు కథలు చాలా ఆసక్తికరంగా చెప్పగలరు. అదే ఒరవడి వాళ్లు రాసిన కథల్లోనూ కనిపిస్తుంది. శిల్పం లేనట్లుగా అనిపించే వినూత్నమైన శిల్పం వారి కథల్లో కనిపిస్తుంది. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి రాసిన కథలను చదువుతుంటే అలా అనిపించింది. తన అనుభవంలోకి వచ్చిన విషయాలను, సమాజాన్ని చదువుతూ తాను తెలుసుకున్న అంశాలను, పరిశోధన చేసి తెలుసుకున్న అంశాలను ఆమె కథలుగా మలిచినట్లు అనిపిస్తుంది. సామాజిక చారిత్రక పరిణామక్రమాన్ని ఆమె తన కథల్లో పట్లుకున్నారు. అంతేకాకుండా సామాజిక పరిణామ క్రమంలో మరుపునకు, దురవగాహనకు గురైన అంశాలను ఆమె తన కథల్లో చిత్రిక కట్టారు.
‘ఎర్ర రేగళ్లు’ పేరిట ఆమె వెలువరిస్తున్న ఈ కథాసంపుటిలో వైవిధ్యమైన కథలు వున్నాయి. తెలంగాణ సమాజంలోని పరిణామాలను, మానవీయ కోణాలను ఆమె తన కథల్లో స్పృశించారు. ఈ సంపుటిలో మొత్తం 15 కథలున్నాయి. ముస్లింలు, హిందువులు కలిసి మెలిసి సాగించిన జీవన ప్రయాణాలు కూడా ఈ కథల్లో కనిపిస్తాయి, కరోనా కాలంలో జీవితాలు ఎలా అల్లకల్లోలమయ్యాయో చెప్పే కథలూ వున్నాయి. 
రెడ్ల జీవిత ప్రయాణాలను, వారి వ్యక్తిగత ప్రవర్తనను కొన్ని కథల్లో డాక్టర్ శ్రీదేవిరెడ్డి చిత్రించారు. రెడ్ల సామాజిక జీవన ప్రయాణాల మీద వచ్చిన కథలు చాలా తక్కువ. ఆ కొరతను కొంత మేరకు ఈ రచయిత్రి తీర్చారు. ‘నాగిరెడ్డిపల్లె’, ‘బాల్రెడ్డి’, ‘కావలి బుడ్డమ్మ’ ఇంకా కొన్ని కథల్లో రెడ్ల పాత్రలు కనిపిస్తాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఇవి అవసరమైన కథలుగా కనిపిస్తాయి. గంపగుత్తగా రెడ్డి సామాజిక వర్గాన్ని దోపిడీదారులుగా, పీడకుల చిత్రించే ‘రాజకీయం’ నడుస్తున్నది. కులం రీత్యా అగ్రకులమే అయినప్పటికీ గ్రామ నిర్మితిలో, గ్రామ ప్రజల సంక్షేమంలో వారు నిర్వహించిన పాత్ర తక్కువదేమీ కాదు. అలాగే ఇతర కులాలవారితో వారు నెరిపిన, నెరుపుతున్న సామాజిక, వ్యక్తిగత జీవితాలు త్యాగంతోనూ, సానుకూల ఆలోచనతోనూ సాగాయని చెప్పడానికి ఈ కథలు రుజువులుగా నిలబడతాయి. 
సామాజిక పరిణామ క్రమంలోనూ, సామాజిక నిర్మాణంలోనూ, గ్రామీణ వ్యవస్థ మానవ సంబంధాల విషయంలోనూ రెడ్లను ప్రతికూలంగానే చూపుతున్నారు. కులవాదం కాస్తా వ్యక్తివాద ఎజెండాగా మారిన వైనానికి ఇది అద్దం పడుతుంది. కాకుంటే భావవాదంగా మారింది. విసునూరు రామచంద్రారెడ్డినే రెడ్ల ప్రతీకగా దశలో మనం వున్నాం. రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కుర్రారం రామిరెడ్డి, బిఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటివారు చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. అంతటి త్యాగాలు చేయకపోయినా గ్రామ సంబంధాల్లో, గ్రామాభివద్ధిలో, గ్రామ సమస్యల పరిష్కారంలో, మానవ సంబంధాల విషయంలో చాలా మంది రెడ్లు సానుకూల పాత్ర పోషించారని ఆమె కథలు చదివితే మనకు అర్థమవుతుంది. గ్రామీణ వ్యవస్థలో రెడ్లు పోషించిన సానుకూల పాత్ర కూడా అర్థమవుతుంది. ‘బందూకు చెప్పిన కథ’ సంపుటిలోని అతి పెద్ద కథ. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని చిత్రించారు. అయితే, ఇందులో ప్రతికూల పాత్ర లేదా పీడక పాత్ర పోషించిన రెడ్డితో పాటు దౌష్ట్యాన్ని ఎదరించిన రెడ్లు కూడా మనకు కనిపిస్తారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రక పురుషులు మన ముందు నిలబడుతారు. సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేసిన తమ తాత తరాన్ని మనవడు గుర్తు చేసుకోవడం ద్వారా ఆమె కథను నడిపించారు. మరుగున పడిన సాయుధ పోరాట వీరుల చరిత్రను ఆమె ఈ కథ ద్వారా గుర్తు చేశారు.
అయితే, ఆమె ఈ కథలను ఎవరికో సమాధానంగా రాయలేదు. తాను చూసిన, తాను అనుభవంలోకి తెచ్చుకున్న సమాజాన్ని మాత్రమే చిత్రించారు. అంటే పనిగట్టుకుని ఇది సత్యం అనే నిశ్చయవాదం ఆమె కథల్లో కనిపించదు. సామాజిక వాస్తవికతకు, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సామాజిక వాస్తవికతకు అవి అద్దం పడుతాయి. ఏం జరిగిందో మాత్రమే ఆమె చెప్పారు. ఒక వర్గాన్ని ఎత్తిపట్టడానికి ఆమె ఇతర వర్గాలను కించపరచలేదు, విమర్శించనూ లేదు. కులాల అంతరాలు వున్నప్పటికీ కలిసిమెలిసి సాగించే జీవన ప్రయాణాలను చూపించారు. ఈ కథల్లో వాదోపవాదాలు లేవు, రచయిత్రి సొంత అభిప్రాయాలు లేవు, జీవితాలు మాత్రమే వున్నాయి. 
నేటి విద్యావిధానంలో పిల్లలు బయటకు కనిపించని మానసిక ఒత్తిడి గురవుతున్న తీరుకు ‘చిట్టితల్లి’ కథ అద్దం పడుతుంది. పిల్లలు ఎదుర్కుంటున్న ఒత్తిడిని అత్యంత సున్నితంగా చెప్పిన కథ ఇది. మనకు అర్థం కాని, మన ఆలోచనా పరిధిలోకి రాని విషయాన్ని ఆమె కథగా మలిచారు. ఈ కథను చదివి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. కుటుంబాలు విచ్ఛిన్నమై, మానవ సంబంధాలు దెబ్బ తింటున్న తీరును ‘బాబుగాడు’ కథ చిత్రించింది. అదే విధంగా ‘పాడుబడ్డ బాయి’ కరుణ రసాత్మకమైన కథ. కుటుంబంలో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన ఓ స్త్రీ చివరకు కూతుళ్లు, కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు వున్నప్పటికీ అనాథగా మారిపోయి, అనాథగానే మరణించిన తీరును చిత్రించిన కథ. సమాజంలోని ప్రస్తుత వ్యక్తికేంద్రక సమాజంలోని అమానవీయ కోణాన్ని ఈ కథ చూపుతుంది.
కరోనా కాలంలో మనుషులు పడిన కష్టాల గురించి, సంభవించిన మరణాల గురించి, దెబ్బ తిన్న మానవ సంబంధాల గురించి కథలూ కవిత్వం వచ్చాయి. శ్రీదేవిరెడ్డి ఈ నేపథ్యం నుంచి ‘కంచె’, ‘విధి’, ‘బుగాడా’ అనే మూడు కథలు రాశారు. ఈ మూడు కథలు కూడా విలక్షణమైనవి. దేనికదే ప్రత్యేకమైనది. ‘బుగాడా’ కథ కరోనా కాలంలో నిర్హేతుక ప్రచారాలకు అడ్డుకట్ట వేసిన చిత్రించింది.
‘పోషవ్వ’, ‘మొగిలి’, ‘కుచ్చుల గౌను’ కథలు శ్రీదేవిరెడ్డి నిశిత పరిశీలనకు, పరిశోధనకు అద్దం పడుతాయి. రాళ్లు కొట్టుకుని నిత్యం ఉదరపోషణకే విలవిలలాడే వడ్డెర జీవితాలను ‘కుచ్చుల గౌను’ కథ చిత్రించింది. వారిలోనూ పురుషాధిక్యత ఎలా వుంటుందో తెలిపిన కథ ఇది. ‘పోషవ్వ’ కథ సంచార జాతుల్లోని ‘ఓలి’ అనే దుష్టసంప్రదాయాన్ని చిత్రించింది. ఇక్కడ కూడా మహిళలే బాధితులు కావడం చూస్తాం. ‘మొగిలి’ మత్స్యకారుల కుటుంబంలో తలెత్తిన ప్రతికూల ఘటన ప్రభావాన్ని చూపుతూ మానవీయ స్పర్శతో ముగిసే కథ. ‘కావలి బుడ్డమ్మ’ ఈ సంపుటిలోని మరో విలక్షణమైన, ప్రత్యేకమైన కథ. గ్రామీణ వ్యవస్థలో ఆయా గ్రామాలకు లేదా స్థానిక ప్రాంతాలకు చెందిన దేవతలను చూస్తాం. ‘కావలి బుడ్డమ్మ’ తన త్యాగనిరతి ద్వారా గ్రామీణ ప్రజల మొక్కులు అందుకునే దేవతగా అవతరించిన వైనాన్ని చిత్రించింది. ఇటువంటి గ్రామీణ దేవతలకు ప్రత్యేకమైన కథలు వుంటాయి. వాటిని రికార్డు చేయాల్సిన అవసరాన్ని ఈ కథ తెలియజేస్తుంది. 
‘జుబేదా’ అనే కథ పేద ముస్లిం కుటుంబం దయనీయమైన స్థితిని మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని మహిళ అనుభవించే ప్రత్యేకమైన హింసను కూడా తెలియజేస్తుంది. ఆ మహిళనే తన హింసకు పరిష్కారాన్ని కనుక్కున్న కథ. కేవలం పేదరికాన్ని, దాని వల్ల అనుభవించే దుర్భర పరిస్థితిని మాత్రమే చిత్రించకుండా దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కున్న ముస్లిం మహిళ పాత్రను సృష్టించడం ద్వారా ఒక ప్రగతిశీల దృక్పథాన్ని ప్రదర్శించారు శ్రీదేవి రెడ్డి. 
చివరగా అత్యంత ముఖ్యమైన కథ గురించి మాట్లాడుకుందాం. అది ‘ఎర్రరేగళ్లు’. వైద్య చికిత్స కోసం ఎర్రరేగళ్లను పోగొట్టుకున్న కటుంబం, ఆ ఎర్రరేగళ్లను కుట్రపూరితంగా వశం చేసుకున్న పెద్దల నీతిని ఈ కథ చిత్రించింది. నిజానికి, కపట నాటకానికి తమ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే విషయం కూడా వాటిని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు తెలియకపోవడం అత్యంత చిత్రంగానూ వాస్తవంగానూ కనిపిస్తుంది. వైద్యరంగం ప్రైవేటీకరణ చెంది కార్పోరేట్ ఆస్పత్రులు వచ్చిన తర్వాత చికిత్సకు మానవీయ కోణం నశించింది. ధనార్జనే ధ్యేయంగా ఒక గొలుసుకట్టు విధానంలో వైద్యరంగం ప్రజలను ఎలా మోసం చేస్తున్నదో తెలిపే కథ ఇది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్యులు ఒక కచ్చితమైన అవగాహనతో, ఆచరణతో ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్న వైనం ఈ కథ మన కళ్లకు కడుతుంది. 
శ్రీదేవి రెడ్డి తన కథల్లో గ్రామీణ పదజాలానికి పెద్ద పీట వేశారు. అవసరమైన ప్రతిచోటా తెలంగాణకు, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రత్యేక పదజాలాన్ని కథల్లో వాడారు. యిన్నూరు, పటాకి, యాష్ట, బిందానం, సుస్తు, పొరకట్ట, ఇకమతు, అగస్తంగా వంటి అనేక ప్రత్యేకమైన పదాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. ఈ పదాల వాడకం మాత్రమే కాకుండా స్థానిక ప్రత్యేక సాంస్కతిక ప్రత్యేకతలను కూడా కథల్లో సందర్భాన్ని బట్టి వాడడం కూడా కనిపిస్తుంది. ‘మొగిలి’ అనే కథలో పిల్లవాడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆమె చెప్పారు. ‘పెళ్లయిన పదేళ్ల తర్వాత మొగల్సావ్ పీరుకు మొక్కుకుంటే పుట్టిండు కాబట్టి ఈ పేరు పేరే వాడి పేరయింది’ అని రచయిత్రి అంటారు. ఇది హిందూ, ముస్లింలు కలిసి మెలిసి చేసే ప్రయాణాన్ని కూడా తెలియజేస్తుంది. ‘శంకరమ్మ, చెన్నప్పల పెండ్లి పాలమూరు దగ్గర కురుమూర్తి స్వామి గుట్ట మీద బంధు మిత్రుల మధ్య జరిగింది’ అని అంటారు. పాలమూరు సమీపంలోని కురుమూర్తి స్వామికి ఒక ప్రత్యేకత వుంది. ఇది వేంకటేశ్వరస్వామి దేవుడు కురుమూర్తిగా అవతరించిన ఆలయం అంటారు. ఇక్కడ అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈ సమయంలో మాంసాహారం కూడా వండుకుని తింటారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన కథ కూడా వుండి వుంటుంది. ఇలా స్థానిక పదజాలన్ని, సాంస్కతిక ప్రతీకలను ఉపయోగించడం ద్వారా శ్రీదేవి రెడ్డి తన కథలకు విశ్వసనీయతను సమకూర్చుకున్నారు. 
సామాజిక వాస్తవాలు అయిన కులం, మతం, సాంస్కృతిక విశిష్టతలను చెప్పకుండా కథలు రాసే సంప్రదాయం తెలుగులో విరివిగా వుంది. సూచనప్రాయంగానైనా కులం, మతం అర్థమయ్యే తీరును కథల్లో ప్రవేశపెట్టడం వల్ల కథలకు విశ్వసనీయత సమకూరడమే కాకుండా వాస్తవికతను కూడా సంతరించుకుంటాయి. ప్రాంతం విషయంలోనూ అదే జరుగుతున్నది. నిర్దిష్టత ద్వారా సార్వజనీనం సాధించాల్సిన గుణం చాలా ఉత్తమమైంది. ఆ లక్షణం శ్రీదేవి రెడ్డి కథల్లో కనిపిస్తుంది. మొత్తంగా, ఇవి వాదాల జోలికి వెళ్లని కథలు. సమాజాన్ని యధార్థ దృక్పథంతో చిత్రించిన కథలు. సిద్ధాంత రాద్దాంతాల గొడవ కూడా ఆమెకు ఉన్నట్లు కనిపించదు. ఇవి తెలుగు కథానికా ప్రపంచానికి అందించిన చేర్పుగా భావించవచ్చు.

డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి ‘ఎర్రరేగళ్లు’ అనే కథాసంపుటి త్వరలో వెలువడనుంది. ఆ కథల పుస్తకానికి నేను రాసిన ముందుమాట.

-కాసుల ప్రతాపరెడ్డి