Facebook Twitter
మాదంతా ఓ తరీఖా

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాది మెట్ట ప్రాంతం. మాది అంటే రచయిత, జర్నలిస్టు, కాలమిస్టు తెలిదేవర భానుమూర్తిది కూడా.  మా ప్రాంతం సాహితీవేత్తలను జిల్లాలోని  ఇతర ప్రాంతాల సాహితీవేత్తలు పెద్దగా పట్టించుకోలేదని నాకు అనిపిస్తూ వుంటుంది. మేం ఎక్కడికక్కడ ఒంటరి పోరాటాలు చేస్తూ సాహిత్య ప్రపంచంలో చోటు సంపాదించుకున్నాం. ఎన్. గోపి, ముక్తవరం పార్థసారథి, హరగోపాల్, చిన్నయ్య... ఇలా చాలా మందే వున్నారు. ఇటీవలే ముక్తవరం పార్థసారథి వెళ్లిపోయారు. ఇప్పుడు తెలిదేవర భానుమÖర్తి వెళ్లిపోయారు. ఇద్దరు కూడా తెలుగు సాహిత్య ప్రపంచంలో తమ స్థానాలను పదిలపరుకున్నవారే. మేం సాహిత్యలోకానికి కూడా కాస్తా మోటుగానే కనిపిస్తాం. మనసు మాత్రం వెన్నలా వుంటుంది. ఇది తెలిదేవర భానుమూర్తికి వందశాతం సరిపోతుంది.

భువనగిరి ఖిల్లా, ఆ పట్టణంలోని చర్చి, డిగ్రీ కళాశాల నాకొక అబ్షెసన్. మా వూరి నుంచి హైదరాబాద్ వచ్చే ప్రతిసారీ వాటిని బస్సులోంచి చూడడం ఒక అలవాటుగా మారింది. కానీ, తెలిదేవర భానుమూర్తి అక్కడే పుట్టాడని తెలిసి వుంటే కచ్చితంగా బస్సు దిగి చూసి వుండేవాడినేమో. కానీ హైదరాబాద్‌లో ఉదయం దినపత్రికలో అడుగుపెట్టిన తర్వాత ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఉదయం పత్రికలో కాలమ్ ద్వారా నాకు మొదట పరిచయం. ఆ తర్వాత సాన్నిహిత్యం పెరిగింది. ఆ సాన్నిహిత్యం అలా కొనసాగుతూ వచ్చింది.

తెలంగాణ భాషను, దక్కనీ తెలుగును కలిపి ఆయన తన వ్యంగ్య రచనలకు ఒక ప్రత్యేకమైన శైలిని రూపొందించుకున్నారు. ఆ శైలిలో రాజకీయాలపై, రాజకీయ నాయకుల తీరుపై ఎక్కువపెట్టిన వ్యంగ్యాస్త్రాలు బాగా పేలాయి. ప్రజల తరఫున నిలబడి మాట్లాడడానికే తెలిదేవర భానుమూర్తి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి మేమంతా అంతే. అదే మా తరీఖా. 

తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన భానుమూర్తికి భాష విషయంలో పట్టింపు ఆ కాలంలోనే ఏర్పడిందని అనుకోవాలి. పత్రికల్లో పనిచేసినప్పటికీ భానుమÖర్తి తన సహజసిద్ధమైన మాతృభాషను మార్చుకోలేదు. పలుకుబడి, చల్నేదో బాలకిషన్ వంటి పలు కాలమ్స్ ఆయన వ్యంగ్య వైభవానికి అద్దం పడుతాయి. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ఆయన ‘ఊరోల్లు’ కవితా సంపుటి ప్రస్తావనలోకి వచ్చింది. తెలంగాణ భాష, నుడికారం ఆయన కవిత్వంలో ఉట్టిపడడం అందుకు ప్రధాన కారణం. ‘భానుమÖర్తి తిట్టు రచయిత కాడు, తిరుగుబాటు రచయిత కాడు పేదవాని కోసం పెదవుల శాపం’ రచయిత అని దాశరథి రంగాచార్య అన్నారు. రాజకీయ నాయకులకు, దురహంకారులకు, దోపిడీదారులకు నా శాపమైనా తగలకపోదా అని భావించి శాపనార్థాలు పెట్టే రచయిత తెలిదేవర భానుమూర్తి.

ఆయన ఆక్సిజన్ బార్ కథల సంపుటి నాకు చాలా నచ్చింది. అట్లని మిగతా రచనలు నచ్చలేదని కాదు. ఏ రచనకు ఆ రచనే ఒక ప్రత్యేకం. ఏది రాసినా తన ముద్రను వేసినవాడు తెలిదేవర భానుమూర్తి.  ఎదురుపడితే ఆమాయకంగా పలకరించే భానుమూర్తి లోపలి ఆగ్రహాన్ని అంతా తన రచనల ద్వారా బయటకు పంపిస్తూ వచ్చాడు. సాహిత్యానికి సంబంధించి నా ప్రాంతానికి ఒక ఘనమైన చరిత్రే వుంది అని చెప్పుకోవడానికి తెలిదేవర భానుమూర్తి కూడా వున్నాడు.  ఆయన ఇంత తొందరగా వెళ్లిపోతాడని అనుకోలేదు. నా గురించి చెప్పుకోవడానికి కూడా ఆయన ఒక కొండగుర్తు అయినందుకు సంతోషిస్తా. అదే నవ్వుతో, అదే పలకరింపుతో మనకు భానుమూర్తి మళ్లీ మళ్లీ ఎదురుపడాలని కోరుకుంటున్నా..

- కాసుల ప్రతాపరెడ్డి