Facebook Twitter
ఇప్ప పువ్వుల్లో నిప్పు రవ్వలు.. శివసాగర్ పాటలూ, పద్యాలూ

‘గోధూళి వేళ... గోరింటాకు అరచేతిలో
ఎరుపెక్కే వేళ...హోరెత్తే సముద్రం
ఆకాశాన్ని తాకే వేళ-నాకోసం వేచి చూడు
నాకోసం ఎదురు చూడు..
నాకోసం వేచి చూడు...
భూమి ఆకాశం కలిసేచోట
పొన్నపూలు రాలి పడిన చోట
నేలమాళిగ కన్నీరు కార్చిచ్చైన చోట
నాకోసం ఎదురుచూడు...
 నాకోసం వేచి చూడు...’’ కవి శివసాగర్ రాసిన ఈ మాటలు మనల్ని వెన్నాడతాయి.
 ఉరితీయబడ్డ పాట నుండి, చెరపడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలిబాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి,
తిరిగి వస్తాను..తిరిగి లేస్తాను
ఏ తాడూ నన్ను ఉరితీయలేదు
సగర్వమైన నీ కన్నీళ్ళ నుండి తిరిగి లేస్తాను
హోరెత్తే సముద్రంతో కరచాలనం చేస్తాను
నాకోసం ఎదురుచూడు, నా కోసం వేచి చూడు...
 తిరుగుబాటు అన్నా, ధిక్కారం అన్నా, కవితావేశం అన్నా అసలు ఇదే కదా. మనకి అశాంతిని ప్రసాదించి, అలజడి రేపేదే శివసాగర్ మాట...పాట...కవిత్వం! అరుణోదయ రామారావు గొంతెత్తి, ఆరున్నొక్క రాగంలో ఈ పాట పాడుతుంటే, గది కంపించిపోతుంటే..చాలు ఈ జీవితానికిది చాలు అన్పించింది నాకైతే!
 సరిగ్గా యాభైఏళ్ళ క్రితం...1975 విజయవాడ, ఊర్వశీథియేటర్... కె.బి.తిలక్ తీసిన ‘భూమికోసం’ సినిమా చూస్తున్నాం. పదునైన చాకులా ఉన్న టీనేజ్ జయప్రద ఎగిరెగిరి డాన్స్ చేస్తోంది. 
‘‘చిన్నారీ చిలకమ్మా, చెల్లేలూ చెంద్రమ్మా...భూసామి గుండెల్లో గునపామూ చెంద్రమ్మా..’’ ఉద్రేకంతో ఊగించినపాట శివసాగర్ దని నాకప్పుడు తెలీదు.
 విశాలాంధ్ర కార్టూనిస్టు టీవీ గారు, ఆయన భార్య అరుణక్క మా ఏలూరు వాళ్ళు. ఇద్దరూ విప్లవొద్యమం నుంచి బైటికొచ్చారు. నాటి చిన్నపాటి విప్లవ కేంద్రం విజయవాడ సున్నపు బట్టీల దగ్గర ఉండేవాళ్ళు. ఒక రోజెందుకో వాళ్ళింటికి వెళ్ళాను. అది 1980వ దశకం. అక్కడ సత్యమూర్తి ఉన్నాడు. ఆయన పేరున్న కవి అని  అప్పటికి నాకు తెలుసు. ఆయన గన్నవరం వెళుతున్నారనీ, తోడుగా నన్ను వెళ్ళమని టీవీ గారు అన్నారు. బస్సులో గన్నవరం వెళ్ళాం. నన్ను ఒక టీకొట్టులో కూర్చోమని, దగ్గరలో ఉన్న ఒక ఇంటికి సత్యమూర్తి వెళ్ళాడు. ఆ ఇంట్లోంచి వచ్చిన ఒకామె ఆయనతో చాలాసేపు మాట్లాడింది. ఆమె పార్వతి అని, ఆయన సహచరి అని తర్వాత నాకు తెలిసింది.
 సత్యమూర్తి హైదరాబాదులో ఉన్నప్పుడు , ఆర్టిస్ట్ మోహన్ దగ్గరకు వచ్చేవారు. ఆయన ‘నెలవంక’ కవితా సంపుటికి, ‘జైలు డైరీ’కి మోహన్ కవర్ పేజీ వేశాడు.


2005, జనవరి 10వ తేదీ..
సాయంత్రం నాలుగు దాటుతోంది. బాగ్ లింగంపల్లి లోని మోహన్ ఆఫీసుకు వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోరే. మూడు మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి. బైటే గచ్చు మీద సత్యమూర్తి కూర్చుని ఉన్నాడు. ఆయన కొంత దిగులుగా, విచారంగా కనిపించాడు. పలకరించి ‘’లోపలికి వెళదామా?’’ అన్నాను. ‘‘మద్దూరి నగేష్ బాబు చనిపోయాడు’’ అని ఆయనే చెప్పాడు.  విన్న పేరే గానీ, అంత పెద్ద కవి అని నాకు తెలియదు. ‘‘నగేష్ బాబు గురించి వ్యాసం రాయాలి. అతని కవిత్వం పుస్తకాలు కావాలి’’ అన్నాడాయన. ఒక సారెప్పుడో ఒక మిత్రుని ఇంట్లో మద్దూరి కవిత్వం పుస్తకాలు నాలుగు చూసివున్నాను. ఫోన్ చేసి వెంటనే పంపించమని, శివసాగర్ అడుగుతున్నాడని  చెప్పాను. అతను తెచ్చి ఇచ్చాడు. అప్పటికి చీకటి పడింది. లైట్లు వెలుగు తున్నాయి. మోహన్ బొమ్మలు వేసుకొంటున్నాడు. సత్యమూర్తి ఒక గదిలో కూర్చుని రాసుకుంటున్నాడు. ‘‘మీరేముట్లు?’’ బుక్ తీసుకుని  రెండు కవితలు చదివాను. షాకింగ్ అండ్ హార్డ్  హిట్టింగ్. వీడెవడ్రా బాబూ అనుకున్నాను. మనశ్శాంతి లేకుండా చేశాడు మద్దూరి నగేష్ బాబు. తర్వాత ‘నరలోక ప్రార్థన’ తీశాను. కొన్ని కవితలు చదువుతాను వింటావా? అన్నాను. మోహన్ సరే అన్నాడు. రెండు కవితలు గట్టిగా చదివాక మోహన్ బొమ్మలు వేయడం మానేశాడు. ఇంకా చదవమన్నాడు. మొత్తం అన్ని కవితలూ ఆవేశపడిపోయి చదివేశాను. అదోగొప్ప రాత్రి... అది మరిచిపోలేని అనుభవం. తరువాత నగేష్ బాబు నిర్లక్ష్యం, అరాచకం గురించి విని తెగ ముచ్చటపడ్డాను. కొన్ని రోజులకు, కవి శిఖామణితో కలిసి గుంటూరు జిల్లాలో వాళ్ళ ఊరు వెళ్ళి, మద్దూరి పదోరోజు భోజనాలుచేశాం దళిత కవిమిత్రులతో కలిసి.
 నాకు ఇష్టమైన కవులు విమల, సౌదా, ఎన్.కె. మద్దూరి నగేష్ బాబు, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, కొండేపూడి నిర్మల, జూలూరి గౌరీశంకర్, అన్నవరపు దేవేందర్ అని శివసాగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
                                       *        *          *
 కంభం జ్ఞాన సత్యమూర్తి ఆయన పూర్తి పేరు. కవి శివసాగర్ గా అందరి ప్రేమా పొందిన వాడు. ఆయన పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా అడవికొలను అని సత్యమూర్తి చనిపోయేదాకా నాకు తెలియదు. అయితే, క్రిష్ణా జిల్లా నందివాడ మండలం, శంకరంపాడు గ్రామంలో ఆయన బాల్యం గడిచింది. ఎం.ఏ., బిఎడ్ చదువుకున్నాడు. స్కూల్లో టీచర్ గా పనిచేశాడు. గుంటూరులో రవి కళాశాలలో ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పాడు. ఆ కాలేజీ అధినేత సి.వి.ధన్ కి సత్యమూర్తి అంటే వల్లమాలిన అభిమానం. శివసాగర్ కి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఒక కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు. రెండో వాడు లారీ డ్రైవర్ అయ్యాడు. ఒకమ్మాయి డాక్టర్, మరో అమ్మాయి ఇంజనీర్.

 సత్యమూర్తి సున్నితమైన మనిషి. మృదువైన మాట. ఎవరితోనైనా ఎంతో గౌరవంగా మాట్లాడతాడు. డబ్బుగురించి ఏనాడూ వెంపర్లాడలేదు. ఆస్తుల కోసం తాపత్రయపడలేదు. ఇటు కవిత్వం, అటు ఉద్యమం, ఇటు సౌందర్యం, అటు తిరుగుబాటు... ఈ రెండే అతన్ని బతికించాయి, ముందుకు నడిపించాయి. శివసాగర్ పేరు లేకుండా తెలుగు కవిత్వ చరిత్ర సంపూర్ణం కాదు ఎన్నటికీ!

మండే మాదిగ డప్పు శివసాగర్

 పీపుల్స్ వార్ చెలరేగుతున్నప్పుడు ఉద్యమ కవిత్వం ప్రవాహంలా వచ్చిపడింది. లే, తిరగబడు, నరుకు, చంపు, నెత్తురు పారించు లాంటి అరుపులూ కేకలూ నినాదాలతో నిండిపోతున్న కవిత్వంలో పిట్టల అరుపులు, వెన్నెల మెరుపులూ, ఆకుల గలగలలూ, సెలఏటి పాటలూ తెచ్చి మనకు కానుకగా ఇచ్చినవాడు శివసాగర్. ఆకుపచ్చని లోయల సౌందర్యాన్నీ, చిరుగాలి సితారా సంగీతాన్ని, మంచులో తడిసిన సన్నజాజుల సౌకుమార్యాన్ని, కాంతులీనే భావలాలిత్యంతో విప్లవ కవిత్వానికి వెన్నెల దారులు పరిచిన వాడు సత్యమూర్తి. ఒక దళిత విప్లవ కవిగా దళిత ఈస్తటిక్స్ అంటే ఏమిటో చెప్పాడు. హృద యాన్ని కదిలించే కవితలు రాసి వుంచాడు.
అలలపై నిఘా
అలలు కనే కలలపై నిఘా
అనగలినవాడాయన! 
‘నల్లసూరీడు’ పాట వినాలసలు..

 మరీ ముఖ్యంగా గాయని చంద్రశ్రీ పాడుతున్నప్పుడు...నల్లనల్ల సూరీడు, నల్లాటి సూరీడు- ఆకు చెప్పుల సూరీడు...ఆ ఫోర్స్, ఆ ఉద్వేగం నిన్ను కుదిపేస్తుంది. సత్యమూర్తి మాత్రమే రాయగలిగిన పాట అది.

 ‘‘విప్ప పూల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ నీకిస్త తమ్ముడా..’’ పాటలోని వూపు, ‘నల్ల సూరీడు’లో పలికిన ఆకాంక్ష, మోగిన దళిత ఉద్యమ భేరి... కొత్త ఆశల,ఆశయాల చిగుళ్ళయి  ఒకింత నమ్మకాన్ని ఇస్తాయి. ‘మండే మాదిగ డప్పు’ అనే కవితలో సూర్యుణ్ణి ఎంత బాగా వాడుకున్నాడో!
 సూర్యుడు నేత గాడు...
ఆకాశం మగ్గం మీద ఇంద్ర ధనస్సు వ్యూహాన్ని నేస్తాడు, సూర్యుడు వేటగాడు... ఆకాశం అరణ్యంలో చీకటి చిరుత పులుల్ని వేటాడతాడు.
 సూర్యుడు ప్రియుడు, కోటి కిరణాల తొలికాంతిలో ఆకాశం అంతస్తు దిగి భూదేవి మూగ కన్నుల్ని మనసా ప్రేమిస్తాడు... అంతేనా? ‘‘మండుతున్న మాదిగ డప్పులా ఉదయిస్తోన్న సూర్యుడు’’ అని అంటాడు.
 ‘‘ఈ సమాజానికి మనం పారిశుద్ధ్య కార్మికులం ’’ అన్నాడు అంబేద్కర్. పాత విలువల్ని పూడ్చి పారేయాల్సిన కర్తవ్యాన్ని దళితులకు ఇంత క్లియర్ గా చెప్పగలిగాడు. దళితులకు అధినాయకులుగా, ఉపదేశకులుగా కాక, వాళ్ళలో ఒకరిగా మమేకమైనప్పుడే దళిత రచయితలు దళిత సాహిత్యానికొక ప్రత్యేకమైన సౌందర్య తత్వశాస్త్రాన్ని రూపొందించుకోగలుగుతారు. అని ఒక ఇంటర్వ్యూలో సత్యమూర్తి చెప్పాడు. పీపుల్స్ వార్ యుద్ధ బీభత్సం నుంచి దళిత ఉద్యమ దారుల్లోకి శివసాగర్ నడిచిరావడం, ఆ పాటల్ని వెంటబెట్టుకుని రావడం గొప్ప మలుపు.

 ఆయన ఆగ్రహోదగ్రుడైన విప్లవ కవితామూర్తి మాత్రమే కాదు, గొప్ప సమయస్ఫూర్తి, చమత్కారమూ, హాస్య దృష్టి ఉన్న ఆధునికుడు. ఓ సారి మాటల మధ్య ‘‘మనిషి ఇదివరకు మట్టిగోడల మధ్య ఉన్నప్పుడు, అతని మనసు కూడా మట్టిలా మెత్తగా ఉండేది. ఇప్పుడు సిమెంటు గోడల మధ్య ఉంటున్నాడు. మనసు కూడా కాంక్రీట్ లా గట్టిపడింది’’ అన్నారాయన. గుంటూరులో ఓ సారి లిఫ్ట్ లో వెళుతున్నప్పుడు-ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని రికార్డెడ్ వాయిస్ వినిపించింది. వెంటనే ‘‘ఈ అమ్మాయి నన్ను హైదరాబాద్ లో కూడా పలకరించింది.’’ అన్నాడు కొంటెవాడైన సత్యమూర్తి. ఈ జోకు చెప్పింది మిత్రుడు ఎన్.జె. విద్యాసాగర్. పోలీసుల్ని ఫిజికల్ పోలీస్ అని, చర్చిని స్పిరిచ్యువల్ పోలీస్ అని ఆయనో చోట అన్నాడు. పీపుల్స్ వార్ పార్టీ లోపల కులవివక్ష ఎలా ఉండేది? అని ఒక మిత్రుడు అడిగినప్పుడు ‘‘ఉండీ లేనట్టు, కనిపించీ కనిపించనట్టు ఉండే వివక్షతలను పబ్లిక్ చేయలేం, డిఫైన్ చేయలేం, డిఫెండ్ చేయలేం’’ అన్నాడు సత్యమూర్తి.

 1972లో ఆయన్ని ఖమ్మంలో అరెస్ట్ చేశారు. ఆరేళ్ళు ముషీరాబాద్ జైల్లో,  తరువాత విశాఖ జైల్లో ఉన్నాడు. ఎదురీత, ఏకలవ్య పత్రికలు నడిపాడు. హుందాగా బతికాడు. ఎవరినైనా సరే మనోహరమైన చిరునవ్వుతో పలకరించేవాడు. కొద్ది మందికే తెలుసు సత్యమూర్తి మంచి గాయకుడని. పొరపాటున నక్సలైట్ అయ్యాడు గానీ, ఆయన ప్యూర్ రొమాంటిక్. శివసాగర్ని గుడిపాటి వెంకట విప్లవ చలం అనవచ్చేమో నాకు తెలీదు.

 హైదరాబాద్ రామ్ నగర్ లో ఓ ఇంట్లో ఉండే వాడు. ఎన్. జె. ప్రసాద్, కలేకూరి ప్రసాద్, లెల్లే సురేష్, పైడి తెరేష్ బాబు, గౌతం, చంద్రశ్రీ లాంటి ఎందరో దళిత కవులు, గాయకులు, రచయితలూ, కార్యకర్తలూ వచ్చిపోతుండేవారు. Iam In right place. These are my people... అన్నాడు శివసాగర్.

 గద్దర్, గోరటి వెంకన్నల కవిత్వమూ, పాట, నృత్యమూ మనల్ని ఊగించి, మైమరిపించడానికి ఎంతో ముందు, మబ్బుల మెట్ల మీంచి మన కోసం దిగివచ్చిన దళిత విప్లవ గాన గంధర్వుడు శివసాగర్.  నరుడో భాస్కరుడా అని గొంతెత్తి పాడిన వాడు. విప్లవ కవిత్వాన్ని మండే మాదిగ డప్పుతో సెలబ్రేట్ చేసిన వాడు. దళిత కవితోద్యమానికి దిక్సూచిగా నిలిచిన వాడు.
వృద్ధ సత్యమూర్తికి 80 దాటాయి.
విప్లవోద్యమంతో విసిగిపోయాడు.
దళిత ఉద్యమం చీలికలతో కలత చెందాడు.
ఆశ చావలేదు గానీ - కవి అలసిపోయాడు.
2012 ఏప్రిల్ 17వ తేదీ మహాకవి శివసాగర్ వెళ్ళిపోయాడు.


క్రిష్ణా జిల్లా జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో పెద్ద కొడుకు సిద్ధార్థ ఇంట్లో ఆయన కన్నుమూశాడు. హైదరాబాదులో మిత్రులందరం మాట్లాడుకున్నాం. అంత్యక్రియలు విజయవాడలో అన్నారు. సత్యమూర్తి పాటలు పాడుకుంటూ విజయవాడ వెళ్ళాం. 

 18వ తేదీ మిట్టమధ్యాహ్నం. పాత బస్టాండు దగ్గర బాగా రద్దీగా ఉండే చోట స్మశాన వాటిక. మురిగ్గా ఉంది. ఇరుగ్గా ఉంది. ఒక మూల తడిసిన గచ్చుమీద పాడె ఉంది. కవి శాశ్వత నిద్రలో ఉన్నాడు. కొందరు భక్తిగా దణ్ణం పెట్టుకుంటున్నారు. రచయిత్రి చూపు కాత్యాయని, శివసాగర్ అనుచరుడు పెదరా వూరి వెంకటేశ్వర్లు అటు ఇటు తిరుగుతూ మిత్రుల్ని పలకరిస్తున్నారు. కొందరు కవికి పూలదండలు వేస్తున్నారు.

 అంత్యక్రియలంటే ఆలస్యం అవుతుంది కదా! కొందరు కవులు పక్కనే ఉన్న బార్లో తాగి వస్తున్నారు. మేం సిగరెట్లు కాలుస్తున్నాం. సమయం రెండున్నర దాటుతోంది. చివరికి తెలుగు కవిత్వం చితికి నిప్పంటించారు. నీలి గగనంలోకి పొగలాగా వెళ్ళిపోయాడు కవి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథల్లా, విప్లవోద్యమాన్ని కోల్పోయిన అరణ్యంలా, దిగులుగా నిస్సహాయంగా  మిగిలిపోయాం నిరాశతో!
 *        *         *
 శివసాగర్ ని కలిసినాక ఆయన్ని ప్రేమించాలి. లేదా ద్వేషించాలి. మరొకటి కుదరదు. శివసాగర్ కవిత్వాన్ని చదివినాక ఆయన్ని ఆరాధించాలి. లేదా ఈర్ష్యపడాలి. మరొకటి కుదరదు... అన్న Lelle Suresh   మాటలు మరిచిపోలేనివి.

-తాడి ప్రకాశ్

(శివసాగర్ 14వ వర్ధంతి సందర్భంగా)