
తెలుగులో 1980 దశకం విప్లవోద్యమాన్నీ దాన్ని అనుసరిస్తూ వచ్చిన కాల్పనిక సాహిత్యాన్నీ విమర్శనూ అస్తిత్వ వాద ధోరణులు ఒక కుదుపు కుదిపాయి. ఇందులో భాగంగా మొదట వచ్చింది స్త్రీవాద ధోరణి. 1970 దశకంలో స్త్రీవాద ధోరణి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే Feminist literary criticism ముందుకు వచ్చింది. ఓల్గా, వసంత స్త్రీవాద ధోరణికి సైద్ధాంతిక ప్రతిపత్తిని కల్పించే ప్రయత్నం చేశారు. స్త్రీవాద సాహిత్య విమర్శలో ప్రధానంగా ఎన్నదగింది జయప్రభ భావకవిత్వంలో స్త్రీ అనే గ్రంథం. ఆ తర్వాత ప్రధానమైంది డాక్టర్ పి. లక్ష్మి రాసిన కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు అనే గ్రంథం.
రంగనాయకమ్మ రాసిన వ్యాసాలు స్త్రీవాద విమర్శకు భూమికను తయారు చేశాయని ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ: వాదాలు ` ధోరణులు అనే గ్రంథంలో డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డాడు. తెలుగు కవిత్వంలోకి వేగంగా స్త్రీవాదం దూసుకొచ్చింది. అయితే స్త్రీవాద కవయిత్రులలో బలమైన తాత్వికత ఎవరికీ ఉన్నట్లు అనిపించదని తిరుపతి రావు అభిప్రాయపడ్డారు.
1992 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన సెమినార్ పత్రాలను మల్లాది సుబ్బమ్మ, రామమూర్తి స్త్రీలు ` సాహిత్యం, సంస్కరణ విప్లవం పేర పుస్తకంగా తెచ్చారు. శారదా అశోకవర్ధన్ కందుకూరి వీరేశలింగం పంతులుపై విమర్శనా వ్యాసం రాశారు. స్త్రీ సంస్కరణను పట్టించుకున్న ఆయన ఆమె హ్రుదయఘోషను వినిపించుకోలేదని అన్నారు. ఇది ఆనాటి స్త్రీభావనలో వచ్చిన మార్పుగా గుర్తించవచ్చు. ఇదే పుస్తకంలో మృణాళిని రాసిన నవల ` స్త్రీపురుష సంబంధాలు , ఓల్గా రాసిన నవల సామాజిక విప్లవం , రావి భారతి రాసిన ఆధునిక కవిత్వం స్త్రీపోరాటం, కాత్యాయని విద్మహే రాసిన తెలుగు కథ సామాజిక విప్లవం వ్యాసాలు స్త్రీవాద విమర్శనా ధోరణిని పట్టిస్తాయి. చలం శతజయంతి కమిటీ ప్రచురించిన నూరేళ్ల చలం పుస్తకంలో కె. లలిత, తదితరులు రాసిన వ్యాసాలు ముఖ్యమైనవి.
డాక్టర్ కాత్యాయని విద్మహే సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్కోణంతో పరిశీలించారు. ఆమె వెలువరించిన సంద్రాయ సాహిత్యం దృక్కోణం పేరుతో ప్రచురించిన గ్రంథంలో ప్రాచీన సాహిత్యంలోని స్త్రీ వ్యతిరేక భావనలను ఎత్తి చూపారు. జెండర్ స్పృహను స్వీకరించిన తర్వాత సాహిత్యాన్ని మానవ సంబంధాలతో అనుసంధానం చేసే కొత్త కోణం ఆవిష్కృతమైంది.
అయితే, స్త్రీవాదం దళిత స్త్రీల నుంచి విమర్శను ఎదుర్కుంది. మాకు గోడలు లేవన్న స్త్రీవాదులను కూడా కులం గోడలు వదిలిపెట్టనట్లు కనిపించని పరిస్థితి ఉందని గోగు శ్యామల అన్నారు. దళిత స్త్రీ రచనలతో వెలువడిన నల్లపొద్దు సంపాదకురాలు గోగు శ్యామల తన ముందు మాటలో దళిత స్త్రీవాదం ప్రతిపాదన చేశారు. స్త్రీల ప్రత్యేక పదరూపాలు, వాక్య నిర్మాణ పద్ధతులు, ప్రత్యేక అభివ్యక్తి రీతులు జెండర్ స్పృహ దృక్పథంతో స్త్రీల భాషగా రూపొంది స్త్రీవాద విమర్శ బలపడింది.
- కాసుల ప్రతాపరెడ్డి



