Facebook Twitter
పసివాడి పట్టుదల

ఉపమన్యుడు ఒక నిరుపేద బాలుడు. వేళకు ఇన్ని గంజిమెతుకులు కతకడమే మహాభాగ్యంగా భావించే కుటుంబలో పుట్టాడు. ఓ రోజున ఉపమన్యుడు బంధువుల ఇంటికి వెళ్ళాడు . అక్కడ పిల్లలందరూ పాలు తాగుతూ , ఇతనికి కూడా కాసిని పాలు ఇచ్చారు. మొదటిసారిగా పాలను రుచి చూసిన ఉపమన్యుడు ఇంటికెళ్ళాక తల్లితో.. అమ్మా! నాకూ పాలు కావాలి  అని ఏడవసాగాడు. ఆమ్మ హృదయం ద్రవించిపోయింది . కొడుకును దగ్గరకు తీసుకుని , నాయనా.. కనీసం పాలైనా ఇవ్వలేని ఈ నిర్భగ్యారాలి కడుపున పుట్టడం నీ దురదృష్టం . అయితే మన నొసటి రాతను మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు నీకు గుక్కెడు పాలేం ఖర్మ..  ఆ పాలసముద్రమే తరలి వస్తుంది  అని ఊరడించింది. 

తల్లి మాటలతో ఉపమన్యుడు ఉత్సాహంగా.. అమ్మా, నేను తపస్సు చేసి , ఆ ముక్కంటిని మెప్పిస్తాను అని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్లి  తపస్సు ప్రారంభించాడు.  కఠోర దీక్షతో ఆ పసివాడు చేసే తపస్సు లోకాలను అల్లకల్లోలం చేయసాగింది . దాంతో దేవతలందరూ కలసి పరమేశ్వరుడి వద్దకెళ్లి, ఆ బాలుడి తపస్సును విరమింప జేయమని మొరపెట్టుకున్నాడు. అందుకు సమ్మతించాడు శివుడు.  ఇంతలో కఠోర తపస్సులో లీనమై ఉన్న ఉపమన్యుడి కళ్లెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ప్రత్యక్షమై  కుమారా..  నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను . ఎందుకింత కఠోర తపస్సు చేస్తున్నావు ? అని అడిగాడు . ఉపమన్యుడు కళ్ళు తెరిచి , ఇంద్రుణ్ణి చూసి "మహేంద్రా ! పరమేశ్వరుడి కటాక్షం కోసమే నా ఈ తపస్సు , దయ ఉంచి, ముక్కంటి నాకు త్వరగా ప్రత్యక్షం అయేలా వరమివ్వండి అన్నాడు 

 బాలకా ! పరమేశ్వరుడు ఒక పాషాణం. నీకు కావలసిన వరాలడుగు, నేను అనుగ్రహిస్తాను, వెంటనే ఈ తపస్సు చాలించు  అన్నాడు ఇంద్రుడు . ఆ మాటలు విన్న బాలుడు కోపంతో,   నువ్వసలు ఇంద్రుడివేనా లేక ఆ వేషంలో వచ్చిన మాయావివా? శివనింద చేస్తున్న నిన్ను ఇప్పుడే చంపేస్తాను " అని అన్నాడు ఉపమన్యుడు.

అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా , దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమై..   భక్తా ! నీ తపస్సు నన్ను కదిలింపజేసింది. నీ తల్లి మాట ప్రకారం నీవున్న చోటుకే పాలసముద్రం తరలి వస్తుంది . నీకు సకల సంపదలూ లభిస్తాయి అన్నాడు. జగన్మాత ఆ బాలుణ్ణి ప్రేమతో ఒడిలోకి తీసుకుని మాతృవా త్సల్యంతో తన చనుబాలిచ్చించి. వయస్సులో చిన్నవాడైనా , తల్లిమాటల పట్ల ఉపమన్యుడికి ఉన్న నమ్మకం,  ధృఢదీక్ష అతన్ని పరమేశ్వరానుగ్రహానికి నోచుకునేలా చేశాయి.