‘యువత’గురించి శ్రీశ్రీ కవిత
‘యువత’ గురించి శ్రీశ్రీ కవిత
కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్ధులు
పేర్లకి పకిర్లకి పు
కార్లకి నిబద్దులు
నడిమి తరగతికి చెందిన
అవగుణాల కుప్పలు
ఉత్తమొద్దు రాచ్చిప్పలు
నూతిలోని కప్పలు
తాతగారి నాన్నగారి
భావాలకు దాసులు
నేటి నిజం చూడలేని
కీటక సన్యాసులు
నిన్నటి లీడరు ధోక
నేడు చూడజాలరు
కన్నులున్న జాత్యంధులు
కాకినైనపోలరు
వీళ్ళకి కళలన్నా రస
మన్నా చుక్కెదురు
గోలచేసి ఆరవడమొక
టే వాళ్ళేరుగుదురు
కొంతమంది యువకులు రా
బోవు యుగం దూతలు
పావన నవజీవన బృం
దావాన నిర్మాతలు
బానిస పంధాలను తల
వంచి అనుకరిoచరు
పోనీ అని అన్యాయపు
పోకడలు సహించరు
వారికి నా ఆహ్వానం
వారికి నా సాల్యూట్
- శ్రీశ్రీ (సిప్రాలి)
