Facebook Twitter
బాల్య పుస్తకం

బాల్య పుస్తకం


 
నేను తెరిచిన పుస్తకంలో
కొన్ని గవ్వలు దొరికాయి
వాటినేరిన గురుతులూ,
సగం చెరిగిన అడుగులూ
కనిపించాయి!

ముందు పేజీలో రాసుంది
చల్లటి గాలినీ, వెచ్చటి భావాల్ని
మోసుకొచ్చే ఒక కాలంలోకి
నువ్విప్పుడు వెళ్తున్నావని!

చదవగా చదవగా
చివరాఖరి పేజీ
వెన్నెల్లో తడిచి కారుతున్న
జల్లుల్లా స్పృశించింది!

నిజం చెప్పనా
పుస్తకాన్ని తెరిచి
కళ్లు మూయాలి
ఆ భావాలు నీతో పలకాలంటే
ఆ గవ్వలు నీకు తగలాలంటే
అమ్మ ఒడి వెచ్చదనం నిన్ను తాకాలంటే
వెన్నెల్లో అమ్మతనపు గోరుముద్దల కమ్మదనం
నీపై కురవాలంటే,

'బాల్యం' అనే పుస్తకాన్ని నువ్వు తెరవాలంటే...
చిన్నప్పటి గురుతుల చుట్టూ నువ్ రివ్వున తిరగాలంటే..
క్షణాలన్నీ నువ్వు పట్టిన సీతాకోక చిలుకలై
నీ నవ్వులపై వాలాలంటే...
వాటి రెక్కల రంగు నీ రెప్పలకు అంటాలంటే!!!

- రఘు ఆళ్ల