డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్.. సజ్జనార్
Publish Date:Dec 31, 2025
Advertisement
నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తాగి వాహనం నడపడం కూడదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పిన సజ్జనార్.. న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి దాటిన తరువాత ఒక గంట మాత్రమే సమయం ఇచ్చినట్లు చెప్పారు. ఒంటి గంటకల్లా వేడుకలు ముగించేయాలన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులతో బుధవారం (డిసెంబర్ 31) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జనార్ ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా, వైన్ షాపులు, బార్ల సమయం ముగిశాక ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. బుధవారం (డిసెంబర్ 31) రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో 'డ్రంక్ అండ్ డ్రైవ్' సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాగి డ్రైవ్ చేస్తే పట్టుబడకుండా తప్పించుకునే మార్గాలే లేవని హెచ్చరించిన సజ్జనార్.. డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్ల చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు బడితే.. చంచల్ గూడ జైలకేనన్నారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగ చేస్తే క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. న్యూఇయర్ సందర్భంగా అర్ధరాత్రి వేళల్లో క్యాబ్, ఆటో సేవలను నిరాకరించడం లేదా బుక్ చేసిన చార్జీల కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/zero-tolarence-on-drunk-and-drive-36-211836.html





