జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట
Publish Date:Jul 31, 2025
Advertisement
మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి రోడ్డు పైకి భారీగా చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలయ్యాయి. ఓ సీఐ కిందపడిపోయారు. కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
http://www.teluguone.com/news/content/ys-jagan-25-203201.html





