ఔను జగన్ సీబీఐ దత్తపుత్రుడే .. వారం రోజులు అడిగితే పది రోజులు ఇచ్చారు!
Publish Date:Jun 23, 2022
Advertisement
అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగన్ తన కుమార్తె చదువుకుంటున్న కాలేజీలో స్నాతకోత్సవంలో పాల్గొని కుమార్తె పట్టా తీసుకోవడాన్ని కనులారా చేడాలని భావించారు. అందుకోసం పారిస్ వెళ్లడానికి వారం రోజుల అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ మాత్రం అలా ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సరే కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత జగన్ పారిస్ యాత్రకు అనుమతి ఇస్తూ తీర్పిచ్చింది. అయితే జగన్ కోరినట్లు వారం రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జగన్ విదేశీ యానానికి అనుమతి ఇచ్చింది. అసలు జగన్ అడిగితే వారం అయితే.. న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇవ్వడం ఏమిటని విపక్షాలు ఆశ్చర్యపోతుంటే.. జగన్ తరపు లాయర్లు మాత్రం తెగ ఖుషీ అయిపోయారు. సీబీఐ జగన్ విదేశీ యానానికి అనుమతి ఇవ్వద్దంటూ సీబీఐ న్యాయవాదులు ఉత్తుత్తి కౌంటర్ వేశారా? విదేశీయానానికి అనుమతి ఇవ్వదన్న తమ పిటీషన్ కు బలం చేకూరేలా అసలు వాదనలైనా వినిపించారా అంటూ నెటిజన్లు వీరలెవెల్లో ట్రోల్ చేస్తున్నారు. అడిగిన దాని కంటే ఎక్కువ రోజులు పర్మిషన్ ఇవ్వడం విచిత్రమే. సీబీఐ చాలా వరకూ అక్రమాస్తుల కేసుల్లో జగన్ కు సానుకూలంగా ఉంటోందని… విచారణ ఆలస్యం కావడానికి సహకరిస్తోందన్న విపక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కోర్టుకు హాజరు కాకపోయినా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాయి. న్యాయస్థానాల నుంచి మినహాయింపులు కూడా పొందకుండానే విచారణకు రావడం లేదని అంటున్నారు. అయినా సీబీఐ ఏమీ అనడం లేదని. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కూడా కోర్టుకు నివేదించడం లేదనీ అంటున్నారు. అదే సమయంలో జగన్ ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లారు. కోర్టు నుంచి దావోస్ పర్యటనకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుని మరీ లండన్ వెళ్లి ఒకరోజు ఉండి… ఆ తర్వాత దావోస్ వెళ్లారు. అంటే బెయిల్ షరతులు.. కోర్టు షరతులు ఉల్లంఘించినట్లే. ఈ విషయాన్ని కూడా సీబీఐ కోర్టులో ప్రస్తావించలేదు. దీంతో … అంతా ఓ పద్దతి ప్రకారం..జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె, హర్షరెడ్డి పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే నెల (జులై) 2న జరిగే కాన్వొకేషన్’లో ఆమె డిగ్రీ పుచ్చుకోనున్నారు. ఒక తండ్రిగా కుమార్తె కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరై, అ వేడుకను చూడాలని అనుకోవడం సహజం. అదీగాక, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అదేమీ పెద్ద విషయం కాదు. కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పెద్ద సమస్యే. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అక్రమ ఆస్తుల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయ పరి భాషలో చెప్పలంటే ఆయన నిందితుడు. అది కూడా ఎ1 నిందితుడు. అవును, అయన ముఖ్యమంత్రి అయితే కావచ్చును, కానీ, ఆయన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్న నిందితుడు. కాబట్టి అయన కదలికలకు షరతులు వర్తిస్తాయి. అంటే అయన ఏమి చేయాలో చేయకూడదు, ఎక్కడికి వెళ్లోచ్చు, ఎక్కడికి వెళ్లకూడదు అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అందుకే ఆయన విదేశాలకు వెళ్ళాలంటే న్యాయస్థానం ముందస్తు అనుమతి అవసరం. ఆయన తమకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైన దేశానికి వెళ్లేందుకు వీలులేదు. ఆయన దేశం గడప దాటాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి కావడానికి చాలా ముందుగానే, ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడిగా 16 నెలలు జైలులో ఉండి షరతులతో కూడిన బెయిల్ మీద బయట కొచ్చారు. ఆ బెయిల్ షరతుల్లో పాస్ పోర్టును కోర్టు అధీనంలో ఉంచడం కూడా ఒకటి. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు. అందుకే ఎప్పుడు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఆయన కోర్టు అనుమతి తీసుకుంటారు. అందుకే ఆయన తమ కుమార్తె కాలేజ్ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. అయితే, పారిస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.పారిస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సారి ఏదో కారణం చెప్పి విచారణను ఆలస్యం చేయిస్తున్నారని ఆయన పారిస్ పర్యటనకు వెళ్లనివ్వొద్దని కోర్టులో సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, సిబిఐ అభ్యంతరం చెప్పినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. జఎందుకంటే జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన ప్రతి సారీ, సిబిఐ అభ్యంతరం చెపుతూనే వుంది , సిబిఐ కోర్టు అనుమతి ఇస్తూనే ఉంది. ఈ సారి కూడా అదే జరిగింది. అడిగిన దానికన్నా ఎక్కువ రోజులు విదేశాలలో ఉండేందుకు అనుమతి ఇచ్చేసింది. సీబీఐ న్యాయవాదులు మాత్రం మేం కౌంటర్ వేసినట్లు చేశాం.. అన్నట్లుగానే వ్యవహరించారు తప్ప వాదనల్లో జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునే విషయంలో సీరియస్ వాదనలు వినిపించలేదు. అందుకే నేమో కొందరు జగన్ రెడీ సిబిఐ దత్తపుత్రుడు .. అంటున్నారు. ఇలా అయన అడిగిందే తడవుగా అలా అనుమతులు లభిస్తుండటంతో సామాన్య జనంలో కూడా జగన్ నిజంగా సీబీఐ దత్త పుత్రుడేనా అన్న అనుమానం కలుగుతోంది.
http://www.teluguone.com/news/content/yes-jagan-cbi-adopted-son-cbi-court-permited-his-foriegn-trip-25-138240.html





