జగన్.. పదవి పోయింది.. పార్టీ పొమ్మంటోంది!
Publish Date:Aug 5, 2024

Advertisement
కేవలం ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతోనే జగన్ రాజకీయ ప్రవేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జగన్ ను ఆయన తండ్రి స్థానంలో సీఎం పదవిలో కూర్చోపెట్టేందుకు అంగీకరించని ఒకే ఒక కారణంతో ఆయన సొంత కుంపటి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన అనుక్షణం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో పని చేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా, మలి ప్రయత్నంలో అంటే 2019 ఎన్నికలలో ఆయన ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు.
ఇక ఆ క్షణం నుంచి ఆ పదవిలో తాను శాశ్వతంగా ఉంటానన్న భ్రమలలోనే గడిపారు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి ఒక రాజు, ఏం అనుకుంటే అది చేసేయచ్చు. నచ్చిన వాళ్లు తప్ప మరెవరూ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. అంతే కాదు.. పార్టీలో కూడా తానే సర్వాధికారి అని భావించారు. ఎవరైనా తన అధికారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా పార్టీతో ఆమోదింపచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ ఆయన పంపిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లు బాటు కాదని విస్పష్టంగా తేల్చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత పదవులు అనేవి ఉండవని పేర్కొంది. దీంతో అప్పట్లో ప్లీనరీ వేదికగా వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించి మరీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పార్టీ ఆరంభించిన క్షణం నుంచీ కూడా జగన్ కు తన అధ్యక్ష పదవిని ఎవరైనా తన్నుకుపోతారేమోనన్న భయమే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలన్న నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్ల కోసారి పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కేసి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నింబంధనను వైసీపీ ఎన్నడూ పాటించకపోయినా, పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ విస్పష్టంగా తేల్చేసింది.
ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? తన పార్టీ చెప్పుచేతల్లో ఉంటుందో ఉండదో, సీఎం పదవి ఎల్లకాలమూ తానే పట్టుకు వేళాడగలుగుతానో లేదో అన్న భయం జగన్ కు తొలి నుంచీ ఉందని చెప్పడానికే.. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తన ఎన్నిక అనే లాంఛనాన్ని పూర్తి చేసుకుని, ఆ తరువాత అధికార బలంతో తిమ్మిని బెమ్మిని చేసైనా ఎన్నికల గండాన్ని దాటేసి సీఎంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను 2024 ఎన్నికలలో జనం తిప్పి కొట్టారు. ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం విపక్ష నేతగా కూడా తగవు అంటూ వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. సరే సీఎం పదవి ఎలాగూ లేదు.. కనీసం వైసీపీ అధినేతగానైనా ఉంటారా అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ సీనియర్ నేతలంతా దాదాపుగా సైలెంట్ అయి పోయారు. చాలా మంది తన ఆనుపానులు కూడా అధినేతకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.
ఇక యువనేతలైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ తీరుపై, వ్యవహార శైలిపై, అహంకార పూరిత వైఖరిపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఓటమి తరువాత తొట్టతొలిగా జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన తీరు కారణంగా తాను నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తరువాత రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు మార్గాని భరత్ జగన్ వ్యవహారశైలిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. మద్యం విధానం లోపభూయిష్టంగా తయారవ్వడానికి, తప్పులు జరగడానికి జగన్ అజ్ణానమే కారణమన్న అర్ధం వచ్చేలా మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే కోవలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు జగన్ కారణంగా తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిందని బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పై పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తిరుగుబాటు రానున్న రోజులలో మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
వైసీపీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు జగన్ తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కే పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ నుంచి జగన్ ను బహిష్కరించి కొత్త నేతను ఎన్నుకుంటారా? లేక వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలలోకి చేరుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకూ వైసీపీ నేతలకు జగన్ తీరు, ఆ తీరును సమర్ధించిన కారణంగా ఇతర పార్టీలలోకి ఎంట్రీ లేకుండా పోవడంతో వైసీపీనే జగన్ కు దూరం చేయాలన్న దిశగా ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ycp-leaders-want-to-get-rid-of-jagan-25-182280.html












