పోలీసులకు వైసీపీ నేత డబ్బుల ఎర.. అడ్డంగా బుక్కయ్యారు
Publish Date:Feb 7, 2019
Advertisement
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేయడం సహజం. అయితే ఏపీలో కొందరు నేతలు ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఏకంగా పోలీసులకే డబ్బు ఎర వేసి ప్రలోభాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ సంఘటన మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ప్రలోభాలకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం వైసీపీ కన్వీనర్ వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరుడు మాగంటి వెంకట రామారావు ద్వారా జీ.కొండూరు, మైలవరం పోలీస్ స్టేషన్లకు నగదును పంపారని తెలుస్తోంది. తమకు వెంకట రామారావు అనే వ్యక్తి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ మైలవరం, జీకొండూరు ఎస్సైలు శ్రీనివాసరావు, ఎండీ అష్ఫక్ బుధవారం ఫిర్యాదు చేయడంతో ప్రలోభాలపర్వం వెలుగులోకి వచ్చింది. అయితే అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తమ నేతలను ఇరికిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ ఒత్తిళ్ల కారణంగానే ఎస్సై తమపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు మాగంటి వెంకట రామారావు జీ.కొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు విడుదల చేయడంతో వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ ప్రసాద్ అనుచరుడు వెంకట రామారావు మంగళవారం ఉదయం జి.కొండూరు, మైలవరం పోలీసుస్టేషన్ ఎస్‌ఐలకు ఫోన్ చేశారు. రానున్న ఎన్నికల్లో కృష్ణ ప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇందుకుగాను ఆయన డబ్బులు పంపారని, వాటిని అందించేందుకు కలుస్తానని చెప్పారు. డబ్బులు తీసుకునేందుకు ఎస్సైలు తిరస్కరించారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని వెంకట రామారావును హెచ్చరించారు. ఇదే విషయాన్ని స్టేషన్ జనరల్ డైరీలో నమోదు చేసి, తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అదే రోజు మధ్యాహ్నం రామారావు ఆ పోలీసుస్టేషన్లకు వెళ్లి ఎస్సైల గురించి వాకబు చేయగా, వారు అక్కడ లేరని తెలిసింది. దీంతో నేరుగా వారి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కవర్ తీసుకునేందుకు వారిద్దరూ నిరాకరించారు. తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన రామారావుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు బుధవారం మైలవరం, జి.కొండూరు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. రామారావు పోలీసుస్టేషన్లకు వెళ్లి వాకబు చేసిన ఉదంతానికి సంబంధించిన ఫోన్ డేటా రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను ఆ ఎస్సైలు సేకరించారు. వాటి ఆధారంగా రామారావుపై కేసు నమోదుచేసినట్టు మైలవరం సీఐ సూరిబాబు తెలిపారు.
http://www.teluguone.com/news/content/ycp-leader-booked-for-offering-money-to-cops-for-election-favours-39-85745.html





