జనంలోకి వెళ్లాలంటే వణుకే.. గడప గడపకూ వైసీపీ అంటే క్యాడర్ లో బెదురే!
Publish Date:May 10, 2022
Advertisement
గడప గడపకూ వైసీపీ కార్యక్రమానికి అధికార పార్టీ సిద్ధమౌతోంది. అధినేత ఆదేశాలతో అనివార్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించేదుకు సన్నాహాలు చేసుకుంటున్నది. అయితే వైసీపీ నేతలు, క్యాడర్ లో ప్రజలలోకి వెళ్లాలంటే వణుకుపుడుతోంది. మూడేళ్ల కాలంలో వైసీపీ సర్కార్ పథకాల వల్ల జనాలకు జరిగిన మేలు, లబ్థి చెప్పుకోవడానికి జంకుతోంది. అయితే అధినేత మాత్రం మూడు సంవత్సరాలలో ఒక్కో ఇంటికీ ఉచిత పథకాల ద్వారా ఎంత ఇచ్చామో లెక్కలు వేసి, అందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద తీసుకుని జనంలోకి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ పథకాల గురించి చెబుతూనే ప్రజలకు ఇంకేం కావాలో తెలుసుకుని, అవీ ఇస్తామని హామీలు ఇవ్వాలన్నది గడపగడపకూ వైసీపీ లక్ష్యం. ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి, మళ్లీ వైసీపీ పట్ల సానుకూలత పెంచడమే గడపగడపకూ వైసీపీ లక్ష్యం. అయితే వైసీపీ నేతలకు వాస్తవం తెలుసు, ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందోన్న భయం తెలుసు. మూడేళ్ల కాలంలో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జనం ముందుకు వెళ్లేందుకు జంకుతున్నారు. అందుకే గడపగడపకూ వైసీపీ కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా ఇప్పటి నుంచీ జనాలలోకి వెళ్లాలన్న జగన్ ఒత్తిడి వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిర చేస్తోంది. అసలు సమస్య ఏమిటంటే ఎమ్మెల్యేలు, మంత్రులకు తాము ఇది చేశామని నియోజకవర్గ స్థాయిలో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడమే. ఇక ఉఫాధి హామీ సహా, చేపట్టిన పనులకు మూడేళ్లుగా బిల్లులు రాలేదు. దీంతో పార్టీ కోసమో, పార్టీ తరఫునో ఖర్చు పెట్టేందుకు వైసీపీ నేతలు, క్యాడర్ సుముఖంగా లేరు. ఇక జనం అయితే ఉచితాల సంగతి పక్కన పెట్టి పన్నుపోటు, ధరల పోటుపై అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజాగ్రహాన్ని పసిగట్టిన కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టడమంటే.. ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చవి చూడటమేనని వైసీపీ కింది స్థాయి నాయకులు అంటున్నారు. ఉచితాల లబ్ధిదారుల ఇంత మంది ఉన్నారంటూ జాబితా పట్టుకుని గడపగడపకూ వెళితే ప్రజల నుంచి వచ్చే స్పందనను తలచుకుని మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడితే బాగుండుననని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-cader-fear-to-face-people-25-135706.html





