బాబు అరెస్టుకు రంగం సిద్ధం?.. ఆధారాలెందుకు అధికారం ఉందన్నదే వైసీపీ ధీమా
Publish Date:May 10, 2022
Advertisement
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం. నారాయణ అరెస్టు వార్త బయటకు వచ్చిన మరుక్షణం నుంచీ వైసీపీ కి చెందిన సోషల్ మీడియాలో మరో వార్త ట్రెండింగ్ అవుతోంది. నారాయణ తరువాతి వంతు నారా చంద్రబాబునాయుడేనని. ఇందుకు వారు కారణాలు కూడా చెబుతున్నారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు ఇప్పటికే ఆయన మీద ఉందనీ, సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేస్తోందని పేర్కొంటున్నారు. చంద్రబాబుపై ఈ ఫిర్యాదు చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ అక్రమాల వల్ల ప్రజలకు నష్టం జరిగిందన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఎక్కడైనా ఎప్పుడైనా నష్టపోయిన వారు ఫిర్యాదు చేస్తారు. కానీ ఇక్కడ మేం నష్టపోయామంటూ ఏ ఒక్క ఫిర్యాదూ లేకపోయినా, ఎమ్మెల్యే మాత్రం ప్రజలు నష్టపోయారంటూ చంద్రబాబుపై చేసిన ఫిర్యాదుకు సీబీసీఐడీ స్వీకరించింది.తొలుత అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ పెట్టిన కేసులన్నీ వీగిపోవడంతో.. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల్లో అక్రమాలంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసేసింది. టెన్త్ పేపర్ల లీకేజీ కేసులో ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అరెస్టు చేశారు. కుమారుడి ఆబ్దికం కార్యక్రమంలో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇంతకీ టెన్త్ పరీక్ష పేపర్లు లీకయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే చర్యలు తీసుకోవలసింది పోయి, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు పేపర్లు లీక్ కాలేదని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఇప్పటి వరకూ ఆయన ఆ మాటను వెనక్కు తీసుకోలేదు. పేపర్ల లీకయ్యాయని అంగీకరించనూ లేదు. కానీ ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజీకి బాధ్యులంటూ అరెస్టులు జరిగాయి. నారాయణ అరెస్టుకు ముందు ఇదే కేసులో 60 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది 38 మంది ఉంటే..ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది 22 మంది ఉన్నారు. అయినా సరే ఏపీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకుకు మంత్రిగారు బాధ్యత తీసుకోరు. మొత్తం తప్పంతా నారాయణ విద్యా సంస్థలదే అని తేల్చేసి నారాయణను అరెస్టు చేస్తారు. ఇదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ డైరెక్షన్ లో అరెస్టుకు రంగం సిద్ధమౌతోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వల్ల నష్టపోయామంటూ అందుకు సంబంధించిన ఏ ఒక్క రైతూ ఫిర్యాదు చేయకపోయినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ ప్రాథమిక ఆధారాలున్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా చంద్రబాబునూ అరెస్టు చేసే అవకాశాలున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అయితే కోర్టు సెలవుల సమయంలో బాబును అరెస్టు చేసి వెంటనే బెయిలు వచ్చే అవకాశం లేకుండా చేయాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఈ కేసు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయడమే. ఇదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే విషయం రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అడ్డగోలు అరెస్టులు చేసేలా ఒక విధానాన్ని డెవలప్ చేసుకుంది. అధికార పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తారు. అది చాలు ఆధారాలు, విచారణలతో పని లేకుండా అరెస్టులు చేసేయడమే..ఆ కేసులు కోర్టులో నిలబడతాయా, లేదా అన్నది తరువాత సంగతి ముందు అరెస్టు చేసేయాలి. అంతే. వైసీపీ ప్రభుత్వం ఈ విధానంతోనే ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తి చూపే వారిని వేధింపులకు గురి చేస్తున్నది. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యులకు మాస్క్లలు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పాపానికి సుధాకర్ అనే వైద్యుడిని నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో కొట్టి పిచ్చోడని ముద్రవేసి వేధింపులకు గురి చేయడం దగ్గర నుంచి.. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో అడ్డగోలు అరెస్టులకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు. ఆరెస్టులను తప్పుపడుతూ న్యాయస్తానాలు బెయిలు ఇస్తే కోర్టులను తప్పుపట్టం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అరెస్టు కూడా ఈ కోవలోకే వస్తుంది.
http://www.teluguone.com/news/content/ground-ready-to-arrest-chandrababu-25-135708.html





