ఏపీలో అరాచక పాలన
Publish Date:Apr 23, 2022
Advertisement
జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల దురాగతాలు, దారుణాలు జరిగిపోతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసు అధికారులు కానీ సరైన యాక్షన్ తీసుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ప్రతి అంశాన్నీ.. ప్రతి సంఘటననూ రాజకీయంగా వాడుకోవాలనే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందికానీ, దారుణాలను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతల మాటలకు మాత్రమే తలలూపడం, వారి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించడం ఒక్కటే తమ బాధ్యత అనే విధంగా పోలీసుశాఖ వ్యవహారం ఉందంటున్నారు. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఏదైనా దారుణ ఘటన జరిగిందంటే.. దాని అంతు చూసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసుశాఖ కానీ ఎంతదాకా అయినా వెళతాయనేది అందరికీ తెలిసిన నిజం. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కూడా ఎంతో వేగంగా స్పందించిన రుజువులు ఉన్నాయి. అలాంటి చేవ కానీ, దమ్ము కానీ ఏపీని ఏలుతున్న వారికి గానీ, రక్షక భటులకు కానీ లేవా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు.. ఆ సందర్భంగా బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుంది. అలాగే ఉండాలి కూడా. అయితే.. ఏపీ విషయానికి వచ్చే సరికి ఆ బాధ్యతను విస్మరించి, కేవలం రాజకీయంగా తమకు ఎంత మైలేజ్ వస్తుందనే తీరులోనే నేతలు ఆలోచన చేస్తున్నారని, అలా తాము భవిష్యత్తులో లబ్ధి పొందగలమో అనే విధంగానే వ్యవహరిస్తుండడం దారుణం అని పలువురు విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా.. ‘పిడుగుకి.. బియ్యానికి ఒకే మంత్రం’ చందాన ఏపీలోని అధికార, ప్రతిపక్షాల నేతలు రాజకీయం చేయడమే ధ్యేయంగా మార్చుకోవడంపై జనం నుంచి విమర్శలు వస్తున్నాయి. చేతనైతే ఆయా సందర్భాల్లో బాధితులైన వారికి చేయూతనివ్వాలి, వారికి ధైర్యం చెప్పాలి.. వారికి న్యాయం జరిగేలా చూడాలి కానీ.. పక్క పార్టీపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకోవడం ఏమిటంటూ జనం నిలదీస్తున్నారు. ఏపీలో ఎక్కడ ఏ దారుణం జరిగినా అధికార ప్రతిపక్ష నేతలు అక్కడ వాలిపోతారు.. పోనీ వారేమైనా బాధితులకు సాయపడతారా అంటే అది కాదు.. తమ తమ రాజకీయ ప్రయోజనాల్ని ఆ ఘటన ద్వారా వెతుక్కోటానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాల్లో పోలీసులు కూడా అధికార పక్షానికి కొమ్ము కాసినట్లు వ్యవహరిస్తుండడం సర్వసాధారణంగా మారింది. అధికార పక్షం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు కొందరు పోలీసు బాసులు, పోలీసులు మాట్లాడడం మామూలైందంటున్నారు. దారుణ సంఘటన ఏదైనా చోటుచేసుకున్నప్పుడు పోలీసులు తమ విధి నిబంధనల ప్రకారం కాకుండా అధికారపక్షానికి వత్తాసు పలుకుతుండడంతో వారు చేవచచ్చి ఉన్నారా? అనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. కనీసం పక్క రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూసి అయినా.. ఆంధ్రా పోలీసులు డ్యూటీని సక్రమంగా చేయొచ్చు కదా అంటున్నారు. ప్రభుత్వ పెద్దల తీరు వల్లనైతేనేమి, పోలీసుల ‘జీ హుజూర్’ విధానాల వల్లనైతేనేమి ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, అరాచకాలు, దురాగతాలు రాజ్యం ఏలుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఎలాంటి మినహాయింపూ లేకుండా చట్ట ప్రకారం గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఏపీలో ఏర్పడిందంటున్నారు. దారుణాలను కూడా రాజకీయం చేయకుండా నిజాయితీగా నిలువరించాలని, నిందితులకు సత్వరం సరైన శిక్షలు పడేలా చూడాలనే అభిప్రాయాలు ప్రజల నుంచి సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-anarchy-rule-in-ap-25-134836.html





